న్యూఢిల్లీ‌: భారతీయ వనితలకు ఎంతో ప్రీతిపాత్రమైన బంగారం ధరలు పరుగులు పెడుతున్నది. సోమవారం పసిడి సరికొత్త రికార్డు స్థాయిని నమోదు చేసింది. హైదరాబాద్ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,580కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్‌ పది గ్రాముల రేటు రూ.46,290 పలికింది. వెండిదీ అదే బాట. కిలో వెండి ధర రూ.48,800కి ఎగబాకింది. 

ఇతర ప్రాంతాల్లో పసిడి ధర రూ.50 వేలకు చేరువలో ముగిసింది. ముంబై బులియన్‌ మార్కెట్లో 24 క్యారట్ల బంగారం ధర ప్లస్ 3 శాతం జీఎస్టీతో కలుపుకుని రూ.49,749కి చేరువైంది. కరోనా వైరస్ కేసులు దేశవ్యాప్తంగా పెరగడానికి తోడు అంతర్జాతీయంగానూ పసిడి ధర తాజా గరిష్ఠ స్థాయికి చేరడం వల్ల దేశీయంగా బంగారం ధర సరికొత్త రికార్డుల దిశగా అడుగులేయడానికి కారణం. 

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 10 గ్రాముల బంగారం రూ.48,811 వద్ద ముగిసింది. డాలర్ తో పోలిస్తే రూపాయి బలపడింది. కేజీ వెండి ధర రూ.144 లాభంతో రూ.49,880 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు కారణమైంది.

also read రిలయన్స్ ‘రికార్డు’ల జోరు: తొలి భారతయ సంస్థగా సంచలనం..

భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,767 డాలర్లు, వెండి 18 డాలర్ల ఎగువన ట్రేడవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఉధృతం అవుతుండటంతో పాటు ఆర్థిక పునరుద్ధరణ చాలా కాలం పట్టవచ్చని అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేయడంతో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరిగింది. 

సంక్షోభ కాలంలో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలోకి ఈక్విటీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుండటంతో ధరలు ఎగసి పడుతున్నాయి. గత నెల 18 తర్వాత పసిడి ఔన్స్ ధర గరిష్ఠ స్థాయికి చేరాయి. స్పాట్ గోల్డ్ ధర 1748.05 డాలర్లుగా నిలిచింది. 

తొలుత ఏర్పడిన ఆర్థిక మందగమనం.. దానికి కరోనా తోడవ్వడంతో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడం కూడా దాని ధర పెరిగిపోవడానికి మరో కారణం. ఏప్రిల్ నెలలోనే ఈ ఏడాది చివరికల్లా తులం బంగారం ధర రూ.50 వేల నుంచి రూ.55 వేల మధ్య నిలుస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.