ముంబై: దేశీయ కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ తాజాగా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కరోనా కష్టకాలంలోనూ మెరుపులు, సంచలనాలతో 150 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కల తొలి భారతీయ సంస్థగా నిలిచింది. 

సోమవారం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభం కాగానే కంపెనీ విలువ రూ.28,248 కోట్ల నుంచి రూ. 11,43,667 కోట్లకు చేరుకున్నది. బాంబే స్టాక్ ఎక్చ్చేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్‌లో రిలయన్స్ షేర్ 2.53 శాతం పెరుగుదలతో రూ.1804 వద్ద ట్రేడయింది. 

మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో ఆల్ టైం గరిష్ఠ స్థాయి రూ.1804.20కి చేరుకున్నది. మార్కెట్ ముగిసే వేళకు 0.70 శాతం తగ్గి రూ.1747 వద్ద స్థిరపడింది. 

also read పరస్పర దూషణలు, బెదిరింపులొద్దు.. నెటిజన్లకు రతన్ టాటా సూచన.. ...

ఇక ప్రపంచంలోని టాప్ -10 ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చేరిపోయారు. ముకేశ్ అంబానీ ఆస్తి విలువ 64.60 బిలియన్ల డాలర్లు దాటిన వేళ ఆసియా ఖండం నుంచి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితా ’టాప్-10’లో ఆయనకు స్థానం లభించింది. 

ఒరాకిల్ కార్పొరేషన్, ఫ్రాన్స్ ఫ్రాంకోయిక్ బెటెన్ కోర్ట్ మైరిస్‌లను అధిగమించి ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానంలోకి చేరారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణ రహిత సంస్థగా మారిందని ముకేశ్ అంబానీ గత శుక్రవారం ప్రకటించారు. ముకేశ్ అంబానీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)లో 42 శాతం వాటా ఉంటుంది. 

రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్ ఫామ్స్, రైట్స్ ఇష్యూ జారీ చేయడం ద్వారా కేవలం రెండు నెలల లోపే రిలయన్స్ రూ.1.69 లక్షల కోట్లు సమీకరించడంతో ఇది సాధ్యమైంది. 2021 మార్చి లోగా రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దాలని ముకేశ్ అంబానీ లక్ష్యం నిర్దేశించుకున్నారు. 

చాలా ముందుగా లక్ష్యానికి తొమ్మిది నెలల ముందే రిలయన్స్ ఈ లక్ష్యాన్ని చేదించడం ఆసక్తికర పరిణామమే. కరోనా మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తున్న వేళ పారిశ్రామిక సంస్థలన్నీ నష్టాలతో కునారిల్లుతుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలమైందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.