కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 22.58 శాతం పెరిగి 34.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.54 లక్షల కోట్లు)కు చేరాయి. బంగారం ధర తగ్గి డిమాండ్ పెరగడంతో దేశీయంగా గిరాకీ పుంజుకోవడమే దిగుమతులకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. అదే సమయంలో వెండి దిగుమతులు 71 శాతం తగ్గి 791 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది.  

పసిడి దిగుమతులు పెరిగినప్పటికీ.. 2019-20లో 161.3 బిలియన్‌ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2020-21లో 98.56 బిలియన్‌ డాలర్లకు తగ్గడం గమనార్హం. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో దిగుమతులు మరింత పెరిగి కరెంటు ఖాతా లోటుపై ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.  

ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్‌. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలే ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం జెమ్స్‌ అండ్‌ జెవెల్లరీ ఎగుమతులు 27.5 శాతం తగ్గి 26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

భారత్‌ ఏటా 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని అంచనా. బంగారం దిగుమతులపై ఉన్న సుంకాన్ని గత బడ్జెట్‌లో కేంద్రం 12.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.  

గతేడాది ఆగస్టు 7 నుంచి బంగారం ధరలు తగ్గుతూ... మార్చి 31 వరకూ పతనం కొనసాగినా... జనవరి నుంచి దేశ ప్రజలు బంగారం నగలు కొనడం మానేశారు. ఇందుకు కారణం... ఇంకా ధర తగ్గుతుందేమో అనే ఆలోచనే.

ఐతే... ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరలు పెరుగుతున్నా... ఇప్పుడు కూడా కొనేందుకు సిద్ధపడట్లేదు. ఇందుకు కారణం... కరోనా వల్ల చేతిలో డబ్బు లేని పరిస్థితి రావడమే. మొత్తంగా బంగారం నగల కొనుగోళ్లు తగ్గాయి.