Asianet News TeluguAsianet News Telugu

పెరిగిన పుత్తడి దిగుమతులు.. దాంతోపాటే వాణిజ్య లోటు కూడా..

2016 - 17తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 22 శాతం పెరిగి 33.65 బిలియన్ల డాలర్లకు చేరాయి. దీంతోపాటు వాణిజ్య లోటు కూడా 157 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్థిక శాఖ పేర్కొన్నది.

Gold imports rise 22% to USD 33.65 billion in 2017-18

ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో బంగారం దిగుమతులు 22 శాతం పెరిగాయి. 2017-18 లో 33.65బిలియన్ డాలర్ల పసిడిని భారత్‌ దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్యశాఖ శుక్రవారం తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ దిగుమతులు 27.51 బిలియన్ డాలర్లు కాగా, 2015-16లో 31.7బిలయన్ డాలర్ల విలువ చేసే పుత్తడిని దిగుమతి చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి.

బంగారం దిగుమతులు పెరగడంతో గత ఆర్థిక సంవత్సరం దేశీయ వాణిజ్య లోటు 157 బిలియన్‌ డాలర్లకు పెరిగిందని గణాంకాలు తెలిపాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లోటు 45శాతం ఎక్కువ కావడం గమనార్హం. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఈ లోహం దిగుమతులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు వాణిజ్యశాఖ పేర్కొంది.

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ అత్యధికంగా పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఉంది. ఏటా మన దేశంలోకి 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతవుతుంది. అయితే ఇది వాణిజ్యలోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండడంతో ప్రభుత్వం కూడా దీనిపై దృష్టిపెట్టింది.

మరోవైపు నగలు, వజ్రాల ఎగుమతులు పెంచాలంటే బంగారంపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటంతో అవి దేశీయ ఎగుమతులపై కూడా ప్రభావం చూపిస్తున్నాయని పారిశ్రామిక నిపుణులు అంటున్నారు. 2017-18లో నగలు, రంగురాళ్లు, వజ్రాల ఎగుమతులు 41.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అంతక్రితం సంవత్సరం ఈ ఎగుమతులు 43.3బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

దిగొచ్చిన పసిడి ధర


అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో దేశీయంగా పసిడికి డిమాండ్‌ తగ్గింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేక బులియన్‌ మార్కెట్లో బంగారం ధర దిగి వచ్చింది. రూ. 190 తగ్గడంతో శుక్రవారం మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 30,740గా నమోదైంది. అంతర్జాతీయంగా 0.73 శాతం ధర తగ్గిన పుత్తడి.. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు ధర 1,222.40డాలర్లు పలికింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేమితో పాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం కూడా బులియన్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఇక వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణాల తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ. 230 తగ్గడంతో నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 39,200 పలికింది. అంతర్జాతీయంగా 1.48శాతం తగ్గి ఔన్సు ధర 15.35 డాలర్లుగా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios