రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం ఓ పరిష్కారం దిశగా వెళుతున్న నేపథ్యంలో బంగారం, వెండిధరలు తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు కోలుకోవడంతో బంగారం నుంచి పెట్టుబడులు, మార్కెట్ల వైపునకు తరలుతున్నాయి. దీంతో పసిడి ధరలు కాస్త ఉపశమనం అందిస్తున్నాయి.
Gold and silver price: ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుదల నమోదు చేశాయి. దీంతో బంగారం 53 వేల దిగువకు, వెండి 70 వేల స్థాయికి దిగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడం, రూపాయి బలపడటం వంటి కారణాలతో బంగారం, వెండి లాంటి లోహాల ధరల్లో పతనం కనిపించింది. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
ఇటీవల, ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం 19 నెలల రికార్డు స్థాయికి 10 గ్రాముల రూ.55190 చేరుకుంది. అయితే యుద్ధ వాతావారణం రాజీ దిశగా వెళుతున్న సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు కూడా తగ్గాయి.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సమాచారం ప్రకారం ఈరోజు 10 గ్రాముల బంగారం ధర రూ.992 తగ్గి రూ.52,635కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం రూ.53,627 వద్ద ముగిసింది. మరోవైపు ఈరోజు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. వెండి కూడా కిలోకు రూ.1,949 తగ్గి రూ.69,458కి చేరుకుంది.క్రితం ట్రేడింగ్ సెషన్‌లో వెండి కిలో రూ.71,407గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,983 డాలర్లు, వెండి ధర 25.50 డాలర్లుగా ఉంది.
ధరలు ఎందుకు తగ్గాయి?
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ మాట్లాడుతూ రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఆందోళనలు తగ్గి, దౌత్యపరమైన పరిష్కారానికి అవకాశం ఉన్న సంకేతాల మధ్య బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు గత సెషన్‌లో దాదాపు రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర భారీగా పతనమైందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ రీసెర్చ్) నవనీత్ దమానీ తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతల ద్వారా స్టాక్ మార్కెట్లు పతనం అవగా, సేఫెస్ట్ పెట్టుబడి నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడులు మరలాయి. దీంతో పసడి ధరలకు మద్దతు లభించింది, అయితే ఉద్రిక్తతలు సడలే సంకేతాలు రావడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం కాస్త తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట రష్యా ప్రజల తరలింపుకు మార్గం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో సభ్యత్వం తీసుకోవడం లేదని ప్రకటన చేశారు. నిజానికి, ఉక్రెయిన్ నాటో దేశాల పక్షం వెళుతోందనే కారణంతోనే, రష్యా అదే కారణంతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ల పతనం బాట పట్టడంతో, బంగారం వైపు పెట్టుబడులు తరలాయి.
