Asianet News TeluguAsianet News Telugu

ఉద్దీపనలకు చెల్లుచీటి: ‘వడ్డిం’పైలపైనే సెంట్రల్ బ్యాంకుల నజర్!

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దశాబ్ద కాలం క్రితం చౌక వడ్డీ రేట్ల ద్వారా ఉద్దీపనమిచ్చిన పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు.. వడ్డీరేట్లను మళ్లీ పెంచుతున్నాయి.

Globally, central banks' actions point to 'synchronised' stimulus withdrawal, feel experts

న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు దశాబ్ద కాలం క్రితం చౌక వడ్డీ రేట్ల ద్వారా ఉద్దీపనమిచ్చిన పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు.. వడ్డీరేట్లను మళ్లీ పెంచుతున్నాయి. గత రెండు వారాల్లో భారత్‌తోపాటు కనీసం ఐదు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించాయి. అందులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీఓఈ) కీలక వడ్డీ రేట్లను పెంచగా.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ (ఈసీబీ) మాత్రం యథాతథంగా కొనసాగించాయి.
 
త్వరలో మరో వడ్డింపుపై అమెరికా ఫెడ్, ఈసీబీ సంకేతాలు

త్వరలోనే మరో వడ్డింపు ఉంటుందని యుఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌, ఈసీబీ స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఈ నెల ఒకటో తేదీన భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపో రేట్లను మరో పావు శాతం పెంచింది. జూన్‌ సమీక్షలోనూ 0.25 శాతం వడ్డించింది. దీంతో రెండు నెలల్లోనే కీలక వడ్డీ రేట్లు అరశాతం పెరిగాయి. ఇక అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ గత 18 నెలల్లో వడ్డీరేట్లను సున్నా నుంచి 1.75 శాతానికి పెంచింది. గత వారంలో నిర్వహించిన సమీక్షలో మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. వడ్డీ రేట్లను సున్నా శాతంగానే కొనసాగిస్తున్నట్లు గత నెల 26న జరిగిన సమీక్షలో ఈసీబీ తెలిపింది. ఈ నెల రెండో తేదీన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచడం ద్వారా 0.75 శాతానికి చేర్చింది.
 
అమెరికాను ఆదుకునేందుకు దశాబ్దం క్రితం ఇలా 

దశాబ్దం క్రితం ప్రపంచాన్ని కుదేలు చేసిన అమెరికా ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి గట్టెక్కేందుకు సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా ఆర్థిక వ్యవస్థలకు ఉద్దీపన కల్పించాయి. ప్రధాన దేశాల సెంట్రల్‌ బ్యాంకులన్నీ ఈ ఉద్దీపనలను ఏకకాలంలో ఉపసంహరించుకోవడం మొదలు పెట్టాయని హెచ్‌ఎస్బీసీ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ విభాగ హెడ్‌ మనీష్‌ వాద్వాన్‌ పేర్కొన్నారు. వడ్డీరేట్ల పెంపు విషయంలో వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల నిర్ణయాలను ఒకే కోణంలో చూడలేమని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా ఆర్థిక వేత్త రాధిక రావు అన్నారు.
 
సంపన్న దేశాలు అలా.. వర్దమాన దేశాలు ఇలా

సంపన్న దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు దేశీయ పరిణామాలకు అనుగుణంగా గతంలో చేపట్టిన చర్యలను తిరిగి ఉపసంహరించుకుంటున్నాయి. వర్ధమాన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు మాత్రం తమ కరెన్సీ స్థిరీకరణ కోసం రక్షణాత్మక వ్యూహాన్ని అవలంభిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. తమ కరెన్సీపై ఒత్తిడి పెరగడంతో గడిచిన ఏడాది కాలంలో భారత్‌, మలేషియా, ఇండోనేషియా, టర్కీ, బ్రెజిల్‌తోపాటు పలు వర్ధమాన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీరేట్లను పెంచాయి.

చేనేతకు ప్రోత్సాహం ఇలా

దేశీయ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు మరింత జీవం పోసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనున్నది. 300 రకాల వస్త్రోత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. తద్వారా దేశీయ తయారీకి ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, ఈ రంగానికి సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సైతం సరళీకరించనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. దిగుమతి సుంకాలు పెంచే వాటిలో కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్, గార్మెంట్స్, మానవ తయారీ ఫైబర్స్‌ ఉన్నట్టు చెప్పాయి. ప్రస్తుతం వీటిపై సుంకాలు 5–10 శాతం స్థాయిలో ఉండగా, 20 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు వెల్లడించాయి. ఈ వారంలోనే సుంకాలు పెంచాలని నిర్ణయిస్తే ముందుగా పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. సుంకాలు పెంచడం వల్ల విదేశీ ఉత్పత్తుల కంటే దేశీయ తయారీ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండేందుకు అవకాశం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios