న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు గురువారం శరవేగంగా పుంజుకున్నాయి. ఎకాఎకీన 35 శాతం పెరిగాయి. దీనికి ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ట్వీట్ కారణం కావడం గమనార్హం. 

కరోనా వైరస్ ప్రభావంతో డిమాండ్ తగ్గిపోవడంతో ఇటీవలే రికార్డు స్థాయిలో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. ప్రస్తుత డిమాండుకు తగ్గట్లు చమురు ఉత్పత్తిని తగ్గించి.. మద్దతు ధర కల్పించేందుకు సౌదీ అరేబియా, రష్యా చర్చలు జరుపుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్​ చేశారు.

ప్రతి రోజూ కనీసం 15 మిలియన్ల బ్యారెళ్ల మేరకు ముడి చమురు ఉత్పత్తి తగ్గించడం శుభ వార్త అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ఒక్క ట్వీట్​తోనే అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. 

నార్త్​ సీలో బ్యారెల్​ ముడి చమురు ధర 30శాతం వృద్ధితో 36.29 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ కూడా 25.4శాతం మెరుగుపడి 27.39 డాలర్లకు పెరిగింది.గురువారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ ధర 32.86 డాలర్లకు చేరుకుని తర్వాత 28.57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ప్రకారం రష్యా, సౌదీ అరేబియా ప్రతి రోజూ 10 నుంచి 15 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి తగ్గిస్తాయని తెలుస్తున్నది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లోనూ బ్యారెల్ ధర 24.74 డాలర్లు పలుకుతోంది. 

ట్రంప్​ ట్వీట్​పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ అధికార ప్రతినిధి స్పందిస్తూ సౌదీ యువరాజుతో ఎలాంటి సంభాషణలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే దీని ప్రభావం చమురు ధరలపై పడే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం సౌదీ అరేబియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒపెక్​ దేశాలు సహా అన్ని చమురు ఉత్పత్తి దేశాలతోనూ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. 

చమురు ధరల స్థిరీకరణ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. సౌదీ యువరాజు మహమ్మద్​బిన్ సల్మాన్​, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్​ సంభాషణ జరిగిన కొద్ది సేపటికే.. సౌదీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అయితే, ఒపెక్​ సహా 22 దేశాలతో ఇది వరకే సౌదీ చర్చలు జరిపినా ఎలాంటి ఒప్పందం మాత్రం కుదరలేదు. ఇందుకు రష్యా అవలంభించిన తీరే ప్రధాన కారణమని సౌదీ అరేబియా ఆరోపించింది. 

సౌదీ, రష్యా మధ్య నెలకొన్న విభేదాల వల్ల చమురు ధరలు ఇటీవలే 18 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. రష్యా, సౌదీ అరేబియాలపై అమెరికా వత్తిడి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయింది. 2008 జూలైలో ముడి చమురు బ్యారెల్ ధర  142 డాలర్లకు పెరిగింది. ఇదే ముడి చమురు మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్ఠంగా నిలిచింది.

నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి ముడి చమురు ధర తక్కువగా ఉంటే.. అమెరికా షెల్ ఆయిల్ వ్యాపారులకు అసలు బిజినెస్ ఉండదేమోనని ట్రంప్ భావిస్తున్నారు. 

అధికంగా ముడి చమురు ఉత్పత్తి చేయడం వల్ల రష్యాకు బ్యారెల్‌పై 16-18 డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. తాజా పరిణామం రష్యాకు మేలు చేసేదే. ఇక బ్యారెల్ ముడి చమురు ధర 68 డాలర్లు ఉంటేనే అమెరికన్ చమురు వ్యాపారులకు గిట్టుబాటవుతుందన్న విమర్శ వినిపిస్తున్నది.