Asianet News Telugu

రాఫెల్ పై నో కామెంట్: ఎన్బీఎఫ్సీకి పెద్దన్నలా ‘ఆర్బీఐ’..అనిల్ అంబానీ


నిబంధనల కఠినతరంలో సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ పెద్దన్నలా ఆదుకున్నప్పుడే ఆ రంగం నిలదొక్కుకుంటుందని రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. ప్రధానంగా 3 అంశాలు దెబ్బతీస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రెడిట్‌ రేటింగ్‌కు విశ్వసనీయ విధానాలు అవసరం అని అన్నారు. ఇక రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదంపై స్పందించేందుకు నిరాకరించారు. 

Gasping NBFCs need urgent help: Anil Ambani
Author
Mumbai, First Published May 29, 2019, 12:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ముంబై: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లకు  అత్యవసర సాయం అవసరమని రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ పేర్కొన్నారు. గత 8 నెలలుగా ఎన్‌బీఎఫ్‌సీ రంగం పూర్తిస్థాయి సంక్షోభంలో చిక్కుకు పోయిందని ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ అంబానీ చెప్పారు. కనుక ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ పెద్దన్నలా ఆదుకోవాలన్నారు. 

ఫ్రాన్స్ రక్షణ రంగ సంస్థ నుంచి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై తలెత్తిన వివాదంపై స్పందించేందుకు అనిల్ అంబానీ నిరాకరించారు. ఎన్బీఎఫ్సీ సంస్థలకు నిధుల లభ్యతకు ‘విండో’ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి ద్రవ్యలభ్యత కవరేజీ నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. 

‘అవినీతి ఇతర వ్యవహారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడింది. అత్యవసర చికిత్సా గదిలో ఉన్న రోగిని కాపాడాలంటే కేవలం జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్‌ బిళ్లలు ఇస్తే సరిపోదు. ప్రాణాన్ని కాపాడే వ్యవస్థలన్నీ కావాలి. ఆర్థిక రంగంలో ఎన్బీఎఫ్సీ రంగం పరిస్థితి ఇలాగే ఉంది’ అని అనిల్‌ అంబానీ చెప్పారు. 

నరేంద్రమోదీ సారథ్యంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెంటనే నిధుల లభ్యత పెంచడం ద్వారా వ్యవస్థకు సాయం చేస్తాయని నమ్ముతున్నానని అనిల్ అన్నారు. నష్టభయంతో బ్యాంకులు కూడా ఎన్‌బీఎఫ్‌సీలకు రుణాలు తగ్గించాయని తెలిపారు. 

ఒకవేళ ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ రుణ సంస్థ (హెచ్‌ఎఫ్‌సీ)లకు రుణాలు ఇస్తున్నా, అధిక వడ్డీ ఆశిస్తున్నాయని అనిల్ అంబానీ వెల్లడించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌) సంస్థ చెల్లింపులు ఎగవేసిన దగ్గర నుంచి ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల కొరత ఎదురవుతోందని పేర్కొన్నారు. 

ఇప్పుడు పూచీకత్తు ద్వారా మాత్రమే ఈ సంస్థలకు రుణాలు లభిస్తున్నాయని అనిల్ అంబానీ తెలిపారు. మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కూడా రుణాలివ్వడం తగ్గించేశాయన్నారు. 

‘8 నెలలుగా దేశంలోని పెద్ద ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్‌షీట్ల పరిమాణం కుంచించుకుపోతోంది. రూ.18వేల కోట్ల రుణం ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌, ఆ భారాన్ని తగ్గించేసుకుంటోంది. వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 50 శాతం రుణాన్ని తిరిగి చెల్లించేస్తాం’ అని అనిల్‌ అంబానీ  స్పష్టం చేశారు. 

రిలయన్స్‌ క్యాపిటల్‌, రెండు దాని అనుబంధ సంస్థలు కూడా గత నెలలో స్వల్పవ్యవధి బకాయిలు చెల్లించలేకపోయాయి. రిలయన్స్‌ నిప్పన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో 43 శాతం వాటాను జపాన్‌ భాగస్వామి నిప్పన్‌లైఫ్‌కు విక్రయించడం ద్వారా రూ.6,000 కోట్లను సమీకరిస్తోంది.

సాధారణ బీమా వ్యాపార విభాగంలో, వినోద ఆస్తులనూ రాబోయే కొన్ని వారాల్లో విక్రయిస్తామని అనిల్‌ అంబానీ తెలిపారు. వివరించారు. తమ సంస్థలన్నీ మూలధనంతో సమృద్ధిగా ఉన్నాయన్నారు. 

‘విలువ పెంచి, కొన్నింటిని విక్రయించడం ద్వారా, రుణాలు తగ్గించాలి’ అని తమ సంస్థలకు సూచించినట్లు అనిల్‌ అంబానీ చెప్పారు. రేడియో వ్యాపారాన్ని జాగరణ్‌ గ్రూప్‌నకు విక్రయిస్తుండగా, గృహరుణ వ్యాపారంలో మెజారిటీ వాటాను విదేశీ సంస్థలకు విక్రయించే మార్గాలను రిలయన్స్‌ క్యాపిటల్‌ అన్వేషిస్తోంది. 

ప్రైమ్‌ఫోకస్‌లో 35 శాతం వాటా, రేడియో వ్యాపారంలో వాటాల విక్రయం ద్వారా సమీకరించే రూ.2,000 కోట్లను రుణభారం తగ్గించేందుకు రిలయన్స్ కేపిటల్ వినియోగించనుంది. ‘నగదు (సీ), కోర్టులు (సీ), క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ(సీ) ల ప్రభావం దేశీయ కార్పొరేట్‌ రంగంపై అమితంగా పడుతోంది. 

నగదు కొరత ఉన్నప్పుడు, విచక్షణతో జరిపే కొనుగోళ్లు తగ్గిపోతాయని, రికవరీ ప్రక్రియ ఆలస్యం అయ్యేందుకు కోర్టుల్లో కేసులు కారణం అవుతున్నాయని అనిల్ అంబానీ తెలిపారు. 

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తరవాత క్రెడిట్‌రేటింగ్‌ ఏజెన్సీలు, ఆర్థికసంస్థల రేటింగ్‌ను అతిత్వరగా తగ్గిస్తున్నాయని అనిల్ అంబానీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థల స్థాయిలో, దేశీయ సంస్థలకు తగినంత నైపుణ్యం, ఆధునిక తత్వం లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలు మనుగడ సాగించాలా, వద్దా అనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. 

‘క్రెడిట్‌ రేటింగ్‌ విషయంలో ఆర్‌బీఐ, సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) జోక్యం చేసుకుని, సమతుల్య విధానం అమలయ్యేలా చూడాలి. ప్రస్తుతం రేటింగ్‌ సంస్థలే ‘విచారించేసి, తీర్పు ఇచ్చేసి, ఉరేస్తున్నాయి’ ఈ విధానం సరికాదు. రేటింగ్‌కు విశ్వసనీయ విధానాలు రూపొందించాలి. ప్రస్తుతం రేటింగ్‌ ఏజెన్సీ నుంచే అధికులు ఉండే కమిటీలే పరిశీలన చేస్తున్నాయి. ఆ కమిటీల్లో ఒకే ఒక స్వతంత్ర, మైనారిటీ సభ్యుడు మాత్రమే ఉండటం అనైతికం. ఆ కమిటీల్లో నిపుణులు, బయటి సంస్థల స్వతంత్రులు  సభ్యులుగా ఉండాలి’ అని అనిల్‌ అంబానీ కోరారు. 

‘మేం మా ఆస్తుల విక్రయం ద్వారా రుణభారం తగ్గించుకునేందుకు చేస్తున్న యత్నాలను రేటింగ్‌ ఏజెన్సీలు గుర్తిస్తాయనే ఆశిస్తున్నా. ఎలా అయితే రేటింగ్‌ తగ్గించారో, ఇప్పుడు మా కృషిని గమనించి, రేటింగ్‌ పెంచేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలి’ అని అనిల్‌ అంబానీ విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios