సిటీలపైనే ముఖేశ్‌కు మక్కువ: గ్యాస్ సరఫరాపై రిలయన్స్ బిడ్డింగ్?

Gas retailing bids: Reliance Industries-BP joint venture seeks licence for 15 cities, IGL 13
Highlights

సహజవాయువు వినియోగాన్ని పెంచాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తలపోస్తోంది. 

న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థలకు లాభాలే ప్రధానం. అందునా దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థ ‘రిలయన్స్’. ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ దేశంలోని బిలియనీర్లలో మొదటి వరుసలో ఉంటారు. ఆయన సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మున్ముందు పెట్రో కెమికల్, సహజ వాయువు రంగాలపై ప్రత్యేక ద్రుష్టిని కేంద్రీకరించింది. ఇందుకు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020 నాటికి కోటి కుటుంబాలకు పైపులైన్ల ద్వారా వంటగ్యాస్ పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు ఇప్పుడు పైపులైన్ల ద్వారా పంపిణీ చేస్తున్న గ్యాస్ కంటే మూడు రెట్లు ఎక్కువ.

దేశంలో సహజవాయువు వినియోగాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇతర కార్పొరేట్ సంస్థల మాదిరిగానే రిలయన్స్ కూడా తమకు అనువుగా మార్చుకోనున్నది. ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో గ్యాస్ రిటైల్‌గా విక్రయించేందుకు అవసరమైన లైసెన్సులను పొందేందుకు సంస్థల నుంచి బిడ్ల ఆహ్వానానికి తొమ్మిదో విడత ప్రక్రియ మంగళవారం ముగిసింది. ఇందుకోసం దేశంలోని 15 ప్రధాన నగరాల్లో గ్యాస్‌ పంపిణీ చేసేందుకు అవసరమైన లైసెన్సు కోసం రిలయన్స్ తన బ్రిటన్ అనుబంధ సంస్థ బీపీతో కలిసి బిడ్‌ సమర్పించింది.

బ్రిటిష్‌ పెట్రోలియం కంపెనీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ద్వారా రిలయన్స్‌ ఈ బిడ్‌ సమర్పించింది. ఈ బిడ్‌ను ప్రభుత్వం ఆమోదిస్తే ఈ 15 నగరాల్లో రిలయన్స్‌.. మోటారు వాహనాలకు అవసరమైన సిఎన్‌జితో పాటు గృహాలకు గొట్టాల ద్వారా వంట గ్యాస్‌ సరఫరా చేయాల్సి ఉంటుంది. రిలయన్స్‌తో పాటు దేశ రాజధాని న్యూఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న ఇంద్రప్రస్థ గ్యాస్‌ కంపెనీ కూడా 13 నగరాల్లో గ్యాస్‌ పంపిణీ లైసెన్సు కోసం బిడ్‌ సమర్పించింది.

మొత్తం 52 నగరాల్లో విక్రయ లైసెన్సుల కోసం బిడ్ల దాఖలుతో అదానీ గ్రూప్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. 32 నగరాల్లో అదానీ గ్రూప్‌ సొంతంగా, మరో 20 నగరాల్లో సంయుక్త సంస్థ భాగస్వామి అయిన ప్రభుత్వరంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) ద్వారా బిడ్లు దాఖలు చేసింది.  ప్రభుత్వరంగ గెయిల్‌, అనుబంధ గ్యాస్‌ పంపిణీ సంస్థ గెయిల్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ 30 నగరాల వరకు బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఎస్సెల్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులు ఏడు బిడ్లు దాఖలు చేసింది. 

దేశీయంగా ప్రాథమిక ఇంధన వినియోగంలో సహజవాయువు వాటా  ఇప్పటివరకు ఆరు శాతం కాగా, దీన్ని కొన్నేళ్లలో 15 శాతానికి చేర్చాలన్నది సర్కార్ ప్రణాళిక. 2020 నాటికి కోటి కుటుంబాలకు వంటగ్యాస్‌ను పైపుల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే రిటైల్‌ విక్రయాలు పెంచేందుకు, లైసెన్స్‌ ఇచ్చేందుకు బిడ్లు ఆహ్వానించింది. తాజాగా 9వ విడత గ్యాస్‌ పంపిణీ బిడ్డింగ్‌ (సీజీడీ) ప్రక్రియ కింద, పరిసర జిల్లాలను అనుసంధానించి మొత్తం 86 ప్రాంతాల్లో (జీఏ) బిడ్లు ఆహ్వానించారు. 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 174 జిల్లాలను కవర్‌ చేయాలన్నది లక్ష్యం. దేశం మొత్తం ప్రాంతంలో 24 శాతం, జనాభాలో 29 శాతం ఈ పరిధిలోకి వస్తాయి. ఈ విడతలో 400 బిడ్లు దాఖలయ్యాయి.

సాంకేతిక బిడ్లు ఈనెల 12-18 తేదీల్లో తెరుస్తారు. అక్టోబర్ నాటికి ఖరారు చేసే వీలుంది. ఈ విడ్ల ద్వారా రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని పెట్రోలియం, సహజవాయువు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) అంచనా వేస్తోంది. ఈ విడతలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. 

ఇప్పటివరకు 8 విడతలలో, 91 ప్రాంతాల్లో లైసెన్సులు ఇచ్చారు. ఇందులో 56 బిడ్డింగ్‌ ద్వారా, మిగిలిన లైసెన్సులను నామినేషన్‌ ద్వారా ప్రభుత్వం కేటాయించారు. వాటినిగెయిల్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌ వంటి సంస్థలు పొందాయి. తాజాగా తొమ్మిదో విడతలో ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్ గ్యాస్ సంస్థల పరిధిలోని 240 మిలియన్ల మందికి సేవలందించాల్సి ఉంది. ఇందులో 42 లక్షల మంది సొంతింటి అవసరాలకు, 31 లక్షల సీఎన్జీ వాహనాల విక్రయం పెరిగింది. 

loader