మీ యూపీఐ అకౌంట్‌కి క్రెడిట్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలో తెలుసా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు యూపీఐ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా క్రెడిట్ కార్డులను యూపీఐకి లింక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంతకీ క్రెడిట్ కార్డును యూపీఐతో ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో యూపీఐ పేమెంట్స్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. కేవలం సెకండ్స్‌లో ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బులు పంపించుకునేందుకు వీలుగా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. 2016లో ప్రారంభమైన యూపీఐ సేవలు రోజురోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎమ్ వంటి డిజిటల్ వ్యాలెట్ సేవలు అందుబాటులోకి రావడంతో డిజిటల్ చెల్లింపులు ఓ రేంజ్‌లో పెరిగాయి. ప్రజలను డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైతం పలు అప్‌డేట్స్‌ను తీసుకొస్తున్నాయి.
క్రెడిట్ కార్డు లింక్
యూపీఐ పేమెంట్స్ అంటే కేవలం మన సేవింగ్స్ ఖాతాలో ఉన్న అమౌంట్‌తో లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిసిందే. అయితే క్రెడిట్ కార్డును కూడా యూపీఐ యాప్‌కి లింక్ చేసుకునే అవకాశాన్ని ఇటీవల కల్పించిన విషయం తెలిసిందే. దీంతో చిన్న చిన్న మొత్తాలకు కూడా క్రెడిట్ కార్డు వినియోగం పెరుగుతోంది. బిల్ పేమెంట్ తేదీ వచ్చిన తర్వాత కార్డులో చెల్లింపులు చేస్తే సరిపోతుంది. అయితే ఈ విధనం కేవలం రూపే క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ కార్డులను మాత్రమే యూపీఐ యాప్‌కు లింక్ చేసుకొని క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్స్ చేసుకోవచ్చు.
ఎలా లింక్ చేసుకోవాలంటే..
ఇందుకోసం ముందుగా యూపీఐ పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఎడమ వైపు కనిపించే త్రీ డాట్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం పేమెంట్స్ మెథడ్స్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అందులో కనిపించే రూపే క్రెడిట్ ఆన్ యూపీఐ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత వెంటనే బ్యాంకుల వివరాలు కనిపిస్తాయి. అందులో మీ రూపే క్రెడిట్ కార్డు జారీ చేసిన బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే మీ కార్డు వివరాలు వస్తాయి. ఇలా కార్డును యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో పేమెంట్ చేసే సమయంలో క్రెడిట్ కార్డు ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ నుంచి పేమెంట్ కట్ అవుతుంది.
ఆర్బీఐ కీలక నిర్ణయం..
ఇదిలా ఉంటే తాజాగా యూపీఐ పేమెంట్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. థర్డ్ పార్టీ మొబైల్ యాప్‌ల ద్వారా యూపీఐ చెల్లింపులు చేసేందుకు, స్వీకరించేందుకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ)కు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకులు లేదా థర్డ్ పార్డీ పార్టీ యాప్ సంస్థల ద్వారా, యూపీఐ యాప్స్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు యూపీఐ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో గిఫ్ట్‌కార్డులు, మెట్రో రైలు కార్డులు, డిజిటల్ వ్యాలెట్ లాంటి పీపీఐ నిర్వాహక సంస్థలకు చెల్లింపుల విషయంలో మరింత వెసులుబాటు లభించనుంది.