హైదరాబాద్: ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ హైదరాబాద్ నగరంలో తన రెండో డేటా కేంద్రాన్ని ప్రారంభించింది. మొదటి డేటా సెంటర్ ముంబైలో ఉంది. డేటా సేవల సంస్థ కంట్రోల్ ఎస్ సహకారంతో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను  నెలకొల్పినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

ఈ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. డేటా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రత్యేక విధానం అమల్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని, దీని వల్ల ఎన్నో మంచి ఫలితాలు వస్తున్నాయని జయేష్ రంజన్ చెప్పారు. 

ఈ కేంద్రం కేవలం సమాచారాన్ని నిల్వ చేయడానికే పరిమితం కాకుండా కృత్రిమ మేథస్సు, మెషీన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డేటా కేంద్రాన్ని ఫ్లిప్‌కార్ట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. 

ఈ నూతన డేటా కేంద్రం వల్ల ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ వేదికపైకి ఎంతో మంది చిన్న, మధ్యతరహా విక్రయదార్లు, వినియోగదారులు వచ్చే అవకాశం ఏర్పడుతుందని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల ముఖ్య అధికారి రజనీష్ కుమార్ తెలిపారు. 

వినియోగదార్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ సెంటర్ తోడ్పడుతుందని తెలిపారు. కంట్రోల్ ఎస్ సీఈఓ శ్రీధర్ పిన్నపురెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.