Asianet News TeluguAsianet News Telugu

కరోనా ‘లాక్ డౌన్’ ఎఫెక్ట్: ఇండియన్ ఎకానమీ చిన్నాభిన్నం

కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థను రూ.9 లక్షల కోట్ల మేర ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Experts peg coronavirus lockdown cost at Rs 9 lakh crore, govt mulls Rs 1.5 lakh crore stimulus package
Author
New Delhi, First Published Mar 26, 2020, 1:17 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రకటించిన లాక్‌డౌన్‌.. దేశ ఆర్థిక వ్యవస్థను రూ.9 లక్షల కోట్ల మేర ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తున్నది. దీంతో ఈ వైరస్‌ కట్టడికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాయి. 

మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మోదీ సర్కార్ అమల్లోకి తెచ్చింది. నిజానికి గత వారం నుంచే వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో స్తబ్ధత నెలకొన్నది. అధికారికంగా లాక్‌డౌన్‌ ప్రకటనతో అన్ని రంగాలు స్తంభించాయి. 

అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిపైనా లాక్‌డౌన్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ లాక్‌డౌన్‌ విలువ దాదాపు రూ.9 లక్షల కోట్లు (120 బిలియన్‌ డాలర్లు) ఉండొచ్చని బుధవారం ఆర్థిక విశ్లేషకులు వెల్లడించారు. దేశ జీడీపీలో ఇది 4 శాతానికి సమానం కావడం గమనార్హం. 

ఈ మూడు వారాల లాక్‌డౌన్‌ విలువే రూ.6.75 లక్షల కోట్లు (90 బిలియన్‌ డాలర్లు)అని లెక్కలేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మరికొన్ని ప్రాంతాల్లో ముందునుంచే లాక్‌డౌన్‌ పరిస్థితులు రావడంతో నష్ట అంచనాలు రూ.9 లక్షల కోట్లకు పెరిగాయి.  

ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నది. త్రైమాసిక జీడీపీ గణాంకాలు దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇక కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో యావత్‌ ఆర్థిక వ్యవస్థే ప్రమాదంలో పడిపోయింది.

భారతావని ఇండ్లకే పరిమితం కావడంతో అన్ని రకాల కార్యకలాపాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లూ వరుసగా కుప్పకూలుతున్న విషయం తెలిసిందే. 

లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరి అవుతున్నది. ఫలితంగా దేశ వృద్ధి అంచనాలూ పడిపోయాయి. ‘ఈ లాక్‌డౌన్‌తో భారత జీడీపీ 4 శాతం లేదా సుమారు రూ.9 లక్షల కోట్లు ప్రభావితం కావచ్చు’ అని బ్రిటన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ బార్క్‌లేస్‌ అన్నది. అంతేగాక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) దేశ జీడీపీ అంచనాను ఏకంగా 1.7 శాతం కుదించి 3.5 శాతానికే పరిమితం చేసింది.

రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెద్ద ఎత్తున కోత పెట్టాలని, అప్పుడే దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఏప్రిల్‌ 3న ఆర్బీఐ ప్రకటించనున్నది. 

మూడో తేదీన జరిగే ఆర్బీఐ సమీక్షలో రెపో రేటు 0.65 శాతం తగ్గవచ్చన్న అంచనాలు వినిపిస్తుండగా, తదుపరి సమీక్షల్లోనూ మరొక శాతం వడ్డీరేటు తగ్గవచ్చని సమాచారం. కరోనా  వైరస్‌ దృష్ట్యా మరింత ఉదారంగా వడ్డీరేట్లను తగ్గించాలని నిపుణులు కోరుతున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాలనూ సడలించాలని సూచిస్తున్నారు. 

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ నేపథ్యంలో చోటుచేసుకున్న విపత్కర పరిస్థితులతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మందగించిన జీడీపీని తిరిగి పరుగులు పెట్టించేందుకు రూ.1.5 లక్షల కోట్లకు (దాదాపు 20 బిలియన్‌ డాలర్లు)పైగా ఉద్దీపన ప్యాకేజీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. 

Also read:కరోనాతో నో ప్రాబ్లం: మైక్రోసాఫ్ట్ మూలాలు పటిష్ఠం తేల్చేసిన సత్య నాదెళ్ల

కాగా, ఈ ఉద్దీపన ప్యాకేజీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మధ్య చర్చలు నడుస్తున్నాయని తెలుస్తున్నది. అయితే గరిష్ఠంగా రూ.2.3 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చని సన్నిహిత వర్గాల సమాచారం. 

ఈ వారంలో ఉద్దీపన ప్యాకేజీపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని సదరు వర్గాల ద్వారా తెలియవస్తున్నది. ఇప్పటికే మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు నిర్ణయాలను తీసుకోగా.. ప్రజలపై భారం పడకుండా బ్యాంకింగ్‌ చార్జీలను ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios