Asianet News TeluguAsianet News Telugu

రూ.5 లక్షల వరకు ఐటీ వద్దు!


త్వరలో ఆదాయం పన్ను విధానంలో సమూల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రత్యక్ష పన్నుల కోడ్ (డీటీసీ)కు మంగళం పాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యక్తిగతంగా ఆదాయం పన్ను శ్లాబ్ గరిష్ట పన్ను రేటు 20 శాతమే ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి డైరెక్ట్‌ ట్యాక్స్‌ కోడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సిఫారసులు చేసింది. దీని ప్రకారం రూ. 20 లక్షల వరకు ఆదాయంపై 10% పన్ను, సూపర్‌ రిచ్‌ ఆదాయంపై 35% ఐటీ విధించడం మేలని సూచించింది. 

Expert panel submits report on replacing I-T Act with direct tax code
Author
New Delhi, First Published Aug 29, 2019, 11:11 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: పన్నుల భారం తగ్గించే దిశగా అత్యున్నత స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ ప్యానెల్ కీలక సిఫారసులు చేసింది. ప్రత్యక్ష పన్నుల కోడ్‌(డీటీసీ) సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం ఈ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వ్యవస్థలో వినిమయం పడిపోతున్న వేళ మధ్య తరగతి ప్రజల చేతుల్లో మరింతగా డబ్బులు నిలిచేలా చేసి.. వారు వినిమయం పెంచే ఉద్దేశంతో ఈ ప్యానెల్‌ ఐటీ హేతుబద్ధీకరణను సూచించినట్టుగా తెలుస్తోంది. 

వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్‌ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్‌ చేసిన కీలక సిఫారసులు చేసింది. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్‌టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. 

ఈ నెల 19న ఈ టాస్క్‌ఫోర్స్‌ పలు సూచనలతో కూడిన నివేదికను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించింది. వ్యక్తిగత ఆదాయం పన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్‌ ఫోర్స్‌ సిఫారసుల్లో అత్యంత కీలక సంస్కరణ. ప్రస్తుతం 5/ 20/30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించాలని తద్వారా 5/ 10/20 శాతం రేట్లను తేవాలని సూచించింది.

ఉన్నత స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తేవాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. 

రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది.

రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో  పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని అధికార వర్గాలు తెలిపాయి.

58 ఏళ్ల క్రితం నాటి ఆదాయం పన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

‘డీటీసీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని అధికార వర్గాల అంచనా. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్‌ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.35 శాతమవుతోంది.

డివిడెండ్‌పై కార్పొరేట్‌ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్‌ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్, బీమా సంస్థల ప్రతినిధులు రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్‌ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు.

విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్‌ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్‌ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్‌ ఫోర్స్‌ సూచన. 

ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్‌ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్నును కూడా కొనసాగించాలని పేర్కొంది.

అయితే రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆర్జించే ఆదాయంపై 30 శాతం వరకు ఆదాయపు పన్ను వర్తింపచేయాలని.. రూ.2 కోట్లు అంతకంటే ఎక్కువగా ఆర్జిస్తున్న సూపర్‌రిచ్‌ సంపన్నుల నుంచి 35 శాతం వరకు ఆదాయపు పన్ను వసూలు చేయాలని ప్యానెల్‌ సర్కారు సలహానిచ్చిందని సమాచారం.

దీనికి తోడు డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్ను, కనిష్ట ప్రత్యామ్నాయ పన్నులను ఎత్తివేయడం తదితర సూచనలను కూడా ప్యానెల్‌ సూచించినట్టుగా తెలుస్తోంది. ఐటీపై సర్‌చార్జీల వాయింపులను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే చేపడితే మేలని కమిటీ సూచించినట్టుగా తెలుస్తోంది. సర్కారు ఈ టాస్క్‌ఫోర్స్‌ నివేదికను అమలు పరిస్తే ఎంతో మంది మధ్య తరగతి ప్రజలకు ఐటీ పన్ను నుంచి కొంత ఊరట లభించనుంది. అయితే పన్ను ఆదాయం తగ్గి ఇబ్బందుల్లో ఉన్న మోడీ సర్కార్ ఈ ప్యానెల్‌ నివేదికను యథాతథంగా అమలు చేయకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios