ఖరీదైన విలాసవంతమైన కార్లు, ఆభరణాల కొనుగోలు దారులకు గొప్ప ఊరట లభిస్తున్నది. గరిష్ఠ విలువ కల ఈ వస్తువులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కంప్యూటీకరణలో ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్)ను తొలగిస్తుండటంతో లగ్జరీ కార్లు, నగల ధరలు దిగిరానున్నాయి.

ఆదాయం పన్ను (ఐటీ) చట్టం కింద ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా ధర మోటార్ వాహనాల కొనుగోలుపై, రూ.5 లక్షలకు పైగా విలువ గల ఆభరణాల కొనుగోలుపై, రూ.2 లక్షల విలువను దాటిన బులియన్‌పై ఒక శాతం లెవీనీ టీసీఎస్‌గా విధిస్తున్న విషయం తెలిసిందే. ఇతర కొనుగోళ్లపై కూడా ఒక్కశాతం లెవీనీ టీసీఎస్‌గా అధికారులు వసూలు చేస్తున్నారు.

ఈ టీసీఎస్ మొత్తాన్ని జీఎస్టీ కంప్యూటీకరణ సమయంలో ఉత్పత్తుల విలువ నుంచి మినహాయించనున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) ఓ ప్రకటనలో తెలిపింది. నిజానికి ఐటీ చట్టం కింద టీసీఎస్ వర్తిస్తుందని గతేడాది డిసెంబర్‌లో సీబీఐసీ స్పష్టం చేసింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ), సీబీఐసీలతో వివిధ సంఘాల సంప్రదింపుల తర్వాత సదరు ప్రతినిధుల అభిప్రాయాల ప్రకారం తాజా నిర్ణయం తీసుకున్నది.

‘వస్తు ఉత్పత్తులపై విధించేదీ టీసీఎస్‌ పన్ను కాదని, అయితే కొనుగోలు చేసిన వస్తువుల నుంచి వస్తుందనుకుంటున్న రాబడిపై మాత్రమే మధ్యంతర లెవీ ఉంటుందని, దీన్ని కూడా తుది ఆదాయ పన్నులో సర్దుబాటు చేసుకోవచ్చని’ సీబీడీటీ స్పష్టతనిచ్చింది. ఐటీ చట్టం, 1961 ప్రొవిజన్ల కింద టీసీఎస్‌ను జీఎస్టీ సరఫరాల కింద పరిగణించినా, దీనిపై విధించే మధ్యంతర లెవీని పన్నుగా గుర్తించజాలమని సీబీఐసీ తెలిపింది.

టీసీఎస్ పై కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) స్పష్టతనివ్వటం వ్యాపారవర్గాలకు ఊరట కలిగించే విషయమని ఇవై ఇండియా టాక్స్‌ పార్ట్‌నర్‌ అభిషేక్‌ జైన్‌ అన్నారు. ప్రధానంగా ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఇది పెద్ద రిలీఫ్‌ అని పేర్కొన్నారు. టీసీఎస్‌ విషయంలో స్పష్టతనివ్వటంతో దీనిపై వివాదాలు లేకుండా పోయాయని, చాలా మంది వ్యాపారులు ఇప్పటికే దీన్ని అర్ధం చేసుకున్నారని తెలిపారు.

కాగా జీఎస్టీని లెక్కించటంలో సీబీఐసీ గతంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించి సర్క్యులర్‌ జారీ చేయటం ద్వారా సున్నితమైన విషయాన్ని క్లిష్టతరం చేసిందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ అన్నారు. తాజాగా జారీ చేసిన సవరించిన సర్క్యులర్‌తో పన్ను చెల్లింపు లెక్కింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లయిందని మోహన్‌ తెలిపారు.