Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్‌కు మోడీ షాక్: నిలిచిపోయిన వేలాది ఉత్పత్తులు

ఆన్ రిటైల్ దిగ్గజాలు అమెజాన్, వాల్‌మార్ట్ సంస్థలకు ఎఫ్‌డీఐ నిబంధనల్లో మార్పులతో భారీ కష్టాలొచ్చాయి. తమ వాటాలు ఉన్న సంస్థల వస్తువులను ఆన్‌లైన్ విక్రయాల జాబితా నుంచి తొలిగిస్తున్నాయి. అమెజాన్ పాంట్రీలో భారీగా నిత్యావసర వస్తువులు నిలిచిపోయాయి. తామూ పరిస్థితిని అంచనా వేస్తున్నామని అమెజాన్ కూడా పేర్కొంది.

Evaluating changes in FDI rules to avoid 'unintended consequences': Amazon
Author
New Delhi, First Published Feb 4, 2019, 12:50 PM IST

అంతర్జాతీయంగా అతిపెద్ద మార్కెట్ భారత్. ఆ మార్కెట్‌ను సొమ్ము చేసుకునేందుకు ప్రముఖ అమెరికా ఈ-రీటైల్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో ప్రణాళికలతో ముందుకు వచ్చింది. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు) నిబంధనలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టాయి. 

దీంతో పలు ఉత్పత్తులను అమెజాన్‌ ఇండియా తన వెబ్‌సైట్‌ నుంచి తొలగిస్తూ వస్తోంది. దాదాపు నాలుగు లక్షల ఉత్పత్తులను తొలగించినట్టు సమాచారం. ఇప్పటికే అమెజాన్‌ ఎకో స్పీకర్స్‌, బ్యాటరీలు, ఫ్లోర్‌ క్లీనర్లు తదితర వస్తువులను తొలగించగా, ఇప్పుడు ప్యాంట్రీలో లభించే వివిధ నిత్యావసర సరకులను ఒక్కొక్కటిగా తొలగిస్తోంది. 

అమెజాన్‌ భారత్‌లో విస్తరణకు ఐదు బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.  కాగా, 2018 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్‌ నికర విక్రయాలు 20 శాతం పెరిగి 72.4బిలియన్‌ డాలర్లుగా నమోదు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ అమ్మకాలు 56-60 బిలియన్‌ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తోంది.

‘ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల ప్రభావం వల్ల ఈ-కామర్స్‌ రంగంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నియమ, నిబంధనలకు మేం కట్టుబడి ఉన్నాం. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం’ అని అమెజాన్‌ సీఎఫ్‌వో బ్రెయిన్‌ ఓల్స్వాస్కీ పేర్కొన్నారు. 

మరోపక్క వినియోగదారుల నుంచి వరుసగా అమెజాన్‌కు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ‘ప్రస్తుతం భారత్‌లో ప్యాంట్రీ సేవలను అందించలేమని, అమెజాన్‌.ఇన్‌ను అనుసరిస్తూ ఉండాలని’ సంస్థ కోరుతోంది.

గత డిసెంబర్‌లో ఈ- కామర్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కేంద్రం మార్చింది. దేశీయ వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణకు నియమ, నిబంధనలను సవరించింది. ఈ నిర్ణయం అమెజాన్‌.కామ్‌తోపాటు వాల్‌మార్ట్‌లాంటి సంస్థలపైనా పడింది.

కొత్త ఈ-కామర్స్‌ పెట్టుబడుల నిబంధనల ప్రకారం తమకు వాటాలు ఉన్న సంస్థల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించరాదు. అలాగే ఆయా వస్తువుల కోసం ప్రత్యేకత (ఎక్స్‌క్లూజివ్‌) అమ్మకాల ఒప్పందాలను కుదుర్చుకోరాదు.

దీంతో క్లౌడ్‌టేల్‌ లాంటి విక్రేతల వస్తువులను అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. ఈ నిబంధనలు అమల్లోకి రాకుండా .. కనీసం నాలుగు నెలల నుంచి ఆరు నెలలు వాయిదా వేయాలని కేంద్రంపై అమెజాన్‌, వాల్‌మార్ట్‌ సంస్థలు ఒత్తిడి తెచ్చినా పనిచేయలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios