న్యూఢిల్లీ:  దేశ  జీడీపీ పాతాళానికి పడిపోతున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌  కొత్త చర్యను చేపట్టబోతోంది. ముఖ్యంగా వినియోగ డిమాండ్‌ భారీగా క్షీణిస్తున్న తరుణంలో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం శాతాన్ని పెంచాలని  యోచిస్తోంది.

also read మీ చుట్టు రోజూ తిరుగలేం...జీఎస్టీ పరిహారంపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

ఈ కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ద్వారా ఉద్యోగుల టేక్ హోమ్ వేతనం పెరగనున్నది. అంటే ఉద్యోగి జీతంనుంచి కట్‌ అయ్యే  పీఎఫ్‌ వాటాలో కోత పడనుంది. ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే సామాజిక భద్రత కోడ్ బిల్లు 2019 లో మారనున్న నిబంధనల ప్రకారం,  పీఎఫ్‌లో ఉద్యోగి వాటా ప్రస్తుత 12 శాతానికి కంటే తక్కువగా ఉండనుంది. యజమాని భాగంలో మాత్రం ఏ మార్పు చేయడంలేదు.

ఎంపిక చేసిన రంగాల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్‌ కటింగ్స్‌లో చట్టబద్ధమైన తగ్గింపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలని చూస్తోంది. తద్వారా వ్యవస్థీకృత రంగంలోని లక్షల మంది ఉద్యోగుల టేక్ హోమ్ జీతం స్వల్పంగా పెరగనుంది. ప్రస్తుత నిబంధనల మేరకు ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం, సంస్థ నుంచి 12 శాతం  పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది.

కొత్తగా రానున్న నిబంధనల ప్రకారం ఉద్యోగి తన పీఎఫ్ అకౌంట్‌లోకి జమ అయ్యే మొత్తాన్ని తగ్గించనుంది. ఇదే కాకుండా ఈఫీఎఫ్ఓలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని తెలుస్తోంది. కనీస వేతన నిబంధనతోపాటు ఉద్యోగి పెన్షన్‌ విధానంలో  కూడా  మార్పులు చేయనున్నది. 

also read భారతి టెలికాంలో విదేశీ సంస్థల పెట్టుబడులు...ఇక విదేశీ సంస్థగా

గత ఐదేళ్లుగా ఈ  ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ సవరణ బిల్లు 2019 డ్రాఫ్ట్‌ను కేంద్ర కార్మిక శాఖ రూపొందించిన  సంగతి తెలిసిందే. మరోవైపు దీర్ఘకాలంలో ఈ చర్య దుష్ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే కార్మికుల పదవీ విరమణ తరువాత అందుకునే నగదు భారీగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.