న్యూఢిల్లీ: జీఎస్టీ నష్టపరిహారాల చెల్లింపుల్లో ఆలస్యంపై రాష్ర్టాల ఆర్థిక మంత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘బకాయిల కోసం రోజూ మేము ఢిల్లీకి రాలేమన్నారు. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతున్నది. మేము అర్హులకు పెన్షన్లను చెల్లించాల్సి ఉన్నది. రోజూ ఢిల్లీ చుట్టూ తిరుగలేం. ఈ పద్ధతేం బాగాలేదు. మాకు బాధగా ఉన్నది’ అని పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం నష్టపరిహార నిధిలో తగినంత నగదు లేదని కేంద్రం చెబుతుండటం సరికాదన్నారు.వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నష్టపరిహారం చెల్లింపుల్లో ఆలస్యంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను బుధవారం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు కలిశారు. జీఎస్టీ పరిహారం చెల్లింపుల జాప్యంపై ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతున్నదన్నారు. 

నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనవారిలో ఢిల్లీ, పంజాబ్, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రులు, కేరళ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు ఉన్నారు. సమావేశం అనంతరం పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ బకాయిలు రావాల్సి ఉందని, చెల్లింపులకు ప్రభుత్వం అభ్యంతరాలు పెడుతున్నదన్నారు. అక్టోబర్, నవంబర్ బకాయిల చెల్లింపులపైనా అనుమానమేనని తెలిపారు.

also read  నీరవ్ మోదీ కొల్లగొట్టింది 13 వేల కోట్లు కాదు....రూ.25 వేల కోట్లు... 

నష్టపరిహారం వీలైనంత త్వరలోనే వస్తుందని హామీ ఇస్తున్న నిర్మలా సీతారామన్.. ఎప్పట్లోగా అది అందుతుందన్న సమాచారం మాత్రం ఇవ్వలేకపోతున్నారని మన్ ప్రీత్ సింగ్ బాదల్ అన్నారు. మరోవైపు నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ‘కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు నన్ను కలిశారు. ఆయా రాష్ర్టాలకు కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ నష్ట పరిహార బకాయిలను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అందరూ వారివారి రాష్ర్టాల ప్రయోజనాల కోసమే అడిగారు’ అని అన్నారు. 

ఇక జీఎస్టీ కింద నష్టపరిహారం పొందడం రాష్ట్రాలకున్న హక్కు అని, దాన్ని కేంద్రం గౌరవిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. 2017 జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్రాల పన్నులను కలిపి తెచ్చిన జీఎస్టీతో రాష్ట్రాలకు ఆదాయం దూరమవుతున్నది. 

దీంతో రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. రెండు నెలలకోసారి ఈ నష్టపరిహారాన్ని కేంద్రం విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ఏప్రిల్-జూలై మధ్య జీఎస్టీ నష్టపరిహారంగా రాష్ట్రాలకు కేంద్రం రూ.45,744 కోట్లను చెల్లించింది. ఆగస్టు-సెప్టెంబర్ నెలలకు రూ.18,784 కోట్లను ఇవ్వాల్సి ఉన్నది.

అయితే జీఎస్టీ వసూళ్లు నిరాశాజనకంగా ఉండటంతో పన్ను మినహాయింపులపై కేంద్రం పునరాలోచనలో పడింది. దీంతో జీఎస్టీ నుంచి తొలగించిన వస్తువులను తిరిగి పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 18న జీఎస్టీ మండలి సమావేశం జరుగనుంది. 

ఆ తర్వాత కొన్ని వస్తు, సేవలకు మళ్లీ జీఎస్టీ పడనుందని సమాచారం. ఆర్థిక మందగమనం, రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లింపుల్లో జాప్యం నేపథ్యంలో జీఎస్టీ ఆదాయం పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే రాబోయే మండలి సమావేశం ప్రధానంగా దృష్టి పెట్టనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నది.

జీఎస్టీ.. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ నినాదంతో దాదాపు రెండున్నరేళ్ల క్రితం మోదీ సర్కార్ ఆఘమేఘాలపై అమలులోకి తెచ్చిన చారిత్రాత్మక సంస్కరణ. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ఉన్న డజనుకుపైగా పన్నులను ఏకం చేసి పరిచయం చేసిన జీఎస్టీ పరిధిలో 500లకుపైగా సేవలు, 1,300లకుపైగా వస్తువులున్నాయి. 0, 5, 12, 18, 28 శాతాల్లో ఆయా వస్తు, సేవలపై పన్నులను విధించారు. 

also read సుందర్​ పిచాయ్‌కు ప్రమోషన్.. ఆల్ఫాబెట్ బాధ్యతలు ఇక సుందర్‌కే

బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25 శాతం పన్ను నిర్ణయించారు. ఇక పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చని కేంద్రం.. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపునిచ్చింది. 

ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విఫలమైందా? అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. జీఎస్టీకి ముందుతో పోల్చితే పన్నుల ఆదాయం పడిపోయిందన్న ఆందోళన ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది మరి. రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని కేంద్రం చెల్లించలేకపోతుండటం ఈ అనుమానాలను మరింత ధ్రువపరుస్తున్నది. తగ్గిన ఆదాయం కారణంగానే నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నామని రాష్ర్టాలకు కేంద్రం లిఖితపూర్వకంగా వివరిస్తున్నది. నిజానికి పన్ను వసూళ్లపై ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలన్నీ దాదాపు విఫలమవుతూనే ఉన్నాయి. 

ప్రజలు, వ్యాపార, పారిశ్రామిక రంగాల అభ్యర్థనలతో గరిష్ఠ శ్లాబుల్లోని వస్తు, సేవలను కేంద్రం.. దిగువ శ్రేణి శ్లాబుల్లోకి మార్చుతూ వస్తుండటం వసూళ్లను ప్రభావితం చేస్తున్నది. దీంతో ఆదాయం పడిపోగా, రాష్ట్రాలకు నష్టపరిహారం పెను భారంగా మారుతున్నది. ఫలితంగా జీఎస్టీ.. మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకే గుదిబండగా మారిందా? అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.