పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు జాతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచిపెట్టి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి గట్టి షాక్ తగిలింది. ఆయనకు చెందిన 13 కార్లను వేలం వేసేందుకు ఎన్‌‌‌ఫోర్స్‌మెంట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇప్పటికే నీరవ్‌కు చెందిన పెయింటింగ్స్ ద్వారా ఆదాయపు పన్ను శాఖ రూ.54.84 కోట్లు సేకరించింది. నీరవ్ కార్లలో రోల్స్ రాయయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు, మూడు హోండా, ఒక టయోటా ఫార్చునర్, ఒక ఇన్నోవా ఉన్నాయి.

ఈ వేలం ప్రక్రియను మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పోరేషన్ లిమిటెడ్‌‌కు అప్పగించారు. వేలంలో పాల్గొనే వారు ముందుగా ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్లను కొనాలనే వారు దీనిని పరిశీలించవచ్చు.

కానీ టెస్ట్ డ్రైవ్ చేయడానికి కుదరదు. కార్ల అంచనా ధర, తయారీ సంవత్సరం, కారు మోడల్, ఫోటోలు, ఇతర డాక్యుమెంట్లను కంపెనీ వెబ్‌సైట్లో ఉంచనున్నారు. వేలం పూర్తయిన తర్వాత కార్ల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం కొంత గడువు ఇవ్వనుంది.