న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మాంద్యం ఊసే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధిరేటు కాస్త మందగిస్తుండవచ్చు కానీ, అయినా మాంద్యంలోకి జారిపోయే పరిస్థితుల్లేవని స్పష్టం చేశారు. రాజ్యసభలో బుధవారం దేశ ఆర్థిక పరిస్థితులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ తన తొలి బడ్జెట్ అనంతరం తీసుకున్న ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయన్నారు. ఆటోమొబైల్స్ తదితర రంగాల్లో పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ క్రమంలోనే గత యూపీఏ-2 హయాంతో పోల్చితే ప్రస్తుతం స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయని సమర్థించుకున్నారు. 

గతంతో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో ప్రత్యక్ష పన్ను, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో పెరుగుదల కనిపించిందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న రంగాలకు ఉద్దీపనల్ని అందిస్తున్నామని, కార్పొరేట్ పన్ను రేటునూ తగ్గించామని గుర్తుచేశారు. దివాలా చట్టం తదితర సంస్కరణల ఫలాలు కూడా వస్తున్నాయని తెలిపారు.

గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ క్షీణతకు కారణం బ్యాంకింగ్ రంగం ఒత్తిడిలో ఉండటమేనని, మొండి బకాయిలు ప్రమాదకరస్థాయికి చేరడమేనని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పరిస్థితికి గత యూపీఏ సర్కారు ఎడాపెడా కార్పొరేట్లకు ఇప్పించిన బడా పద్దులేనని కారణమని ఎదురుదాడికి దిగారు. 

also read తగ్గిన బంగారం, వెండి ధరలు...

బ్యాంకులకు రూ.70 వేల కోట్ల మూలధన సాయం చేస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టేందుకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా రుణాలను బ్యాంకుల ద్వారా అన్ని వర్గాలకు ఇప్పిస్తున్నామని గుర్తుచేశారు. ఇక 2014 నుంచి మోదీ నేతృత్వంలోని బీజేపీ హయాంలో నమోదైన జీడీపీ గణాంకాలను, అంతకుముందు ఐదేండ్లలో మన్మోహన్ పాలన వృద్ధి గణాంకాలను పోల్చారు. 

ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఆర్థిక విస్తరణ జరిగిందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో మాంద్యంలోకి వెళ్లనివ్వబోమన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.6.63 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్-అక్టోబర్ మధ్య రూ.3.26 లక్షల కోట్లు వసూలయ్యాయని చెప్పారు. నెలవారీ వసూళ్లలో వృద్ధి కనిపిస్తున్నదన్నారు. జీఎస్టీ అమలు తీరు క్రమంగా కుదురుకుంటున్నదన్నారు. 

ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు కూడా గతంతో చూస్తే 4.8 శాతం వృద్ధి చెందాయని, ఏప్రిల్-అక్టోబర్‌లో రూ.6.86 లక్షల కోట్లుగా ఉన్నాయని వివరించారు. 2009-14 మధ్య యూపీఏ-2 హయాంలో దేశంలోకి 189.5 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వస్తే, ఆ తర్వాతి ఐదేళ్ల తమ బీజేపీ పాలనలో 283.9 బిలియన్ డాలర్లు వచ్చాయని పేర్కొన్నారు. విదేశీ మారకద్రవ్య నిల్వలు సైతం యూపీఏ-2తో పోల్చితే బీజేపీ పాలనలో 304.2 బిలియన్ డాలర్ల నుంచి 412.6 బిలియన్ డాలర్లకు పెరిగాయని స్పష్టం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన అక్కర్లేదని, అంతా సర్దుకుంటుందని నిర్మలా సీతారామన్ ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. ఓవైపు రేటింగ్ ఏజెన్సీలు.. మరోవైపు ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు.. ఇంకోవైపు నిపుణులు.. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 

also read  బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ...కారణమేమిటంటే!

‘అయినా ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మాకు అవగాహన ఉన్నది. ప్రతీ రంగాన్ని ఆదుకుంటాం. మా దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను తీరుస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థపై వ్యక్తిగతంగా కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు అని మంత్రి నిర్మలా సీతారామన్ విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు.

ఈ ఏడాది జూలై 5న తన తొలి వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రకటించానన్న మంత్రి నిర్మలా సీతారామన్ నాటి నుంచి నేటి వరకు జీడీపీ బలోపేతానికి 32 నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఈ క్రమంలోనే తన బడ్జెట్.. దేశ ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపలేకపోయిందన్న విమర్శలనూ కొట్టిపారేశారు. 

ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి మాట్లాడటానికి బదులు మంత్రి.. బడ్జెట్ ప్రసంగం చదువుతున్నారంటూ విమర్శిస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ ఏప్రిల్-జూన్‌లో దేశ జీడీపీ ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. అయితే, శుక్రవారం జూలై-సెప్టెంబర్ త్రైమాసికం వృద్ధిరేటు గణాంకాలు విడుదల కానున్నాయి.