fake pearls ముత్యం నిజమా? నకిలీనా? తెలుసుకునే మార్గాలివే!
ముత్యం నిజమైనదో కాదో తెలుసుకోవడానికి 7 మార్గాలు: ముత్యాలు చాలా విలువైనవి, కానీ నకిలీవి కూడా మార్కెట్లో ఉంటాయి. అసలు ముత్యాన్ని ఎలా గుర్తించాలంటే ఇలా చేయాలి..

నిజమైన ముత్యం వర్సెస్ నకిలీ ముత్యాలు: ముత్యం (Pearl) ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప బహుమతి. దీన్ని సముద్రంలో మంచి నీటి గుల్లలు (Oysters and Mussels) సహజసిద్ధంగా తయారు చేస్తారు. దీని అందం, మెరుపు ఆభరణాల ప్రపంచంలో వీటిని ప్రత్యేకంగా నిలబెడతాయి. అవి అంత ఖరీదైనవి కాబట్టే.. జనాలను మోసం చేసేలా.. మార్కెట్లో నకిలీ ముత్యాలను అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ముత్యం ఎలా తయారవుతుంది.. అసలు, నకిలీ ముత్యాలను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.
ముత్యం తయారీ విధానం (Pearl Formation Process)
ముత్యం తయారీ అనేది ఒక సహజ ప్రక్రియ. ఇది ఎప్పుడు మొదలవుతుందంటే.. ఏదైనా బయటి పదార్థం (ఉదాహరణకు ఇసుక రేణువు, పరాన్నజీవి లేదా ఇతర పదార్థం) గుల్ల లోపలికి ప్రవేశించినప్పుడు, గుల్ల దాన్ని ప్రమాదకరంగా భావిస్తుంది. తనను తాను కాపాడుకోవడానికి దాని చుట్టూ కాల్షియం కార్బోనేట్, కొంకియోలిన్ (Conchiolin) పొరలను ఏర్పరుస్తుంది. ఈ పొరలు ముత్యానికి అందమైన మెరిసే ఉపరితలాన్ని (Nacre) ఇస్తాయి. ఇది కాలక్రమేణా మెరిసే, గట్టి ముత్యంగా మారుతుంది. ఈ ప్రక్రియకు 6 నెలల నుండి 5 సంవత్సరాల సమయం పట్టవచ్చు.
సహజ ముత్యాలు (Natural Pearls): ఇవి సముద్రంలో లేదా నదిలో ఎటువంటి బయటి సహాయం లేకుండా ఏర్పడతాయి. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి.
కల్చర్డ్ ముత్యాలు (Cultured Pearls): వీటిని కృత్రిమంగా పెంచుతారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా గుల్ల లోపల ఒక చిన్న ముత్యం విత్తనాన్ని వేస్తారు. దీనివల్ల ముత్యం తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ఇవి సహజ ముత్యాల కంటే తక్కువ ధరలో ఉంటాయి, సులభంగా దొరుకుతాయి.
అసలు, నకిలీ ముత్యాలను ఎలా గుర్తించాలి? (How to identify real and fake pearls?)
1. పంటి పరీక్ష (Tooth Test)
అసలు ముత్యాన్ని పళ్ళ మధ్యలో పెట్టి నెమ్మదిగా రుద్దితే కొంచెం గరుకుగా అనిపిస్తుంది. అదే నకిలీ ముత్యం అయితే నునుపుగా, ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది.
2. ఉష్ణోగ్రత పరీక్ష (Temperature Test)
అసలు ముత్యం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. నకిలీ ముత్యం చేతిలో పెట్టుకుంటే వెంటనే వేడెక్కుతుంది.
3. కాంతి పరీక్ష (Shine and Reflection Test)
అసలు ముత్యానికి సహజమైన మెరుపు (Luster) ఉంటుంది. దీన్ని వెలుతురులో తిప్పినప్పుడు కొద్దిగా రంగు మారవచ్చు. నకిలీ ముత్యంలో ఈ మెరుపు, లోతు ఉండవు.
4. పొర పరీక్ష (Layer Test)
అసలు ముత్యం లోపల నకిలీ పొరలు చాలా ఉంటాయి. వాటిని కత్తిరించినప్పుడు చూడవచ్చు. నకిలీ ముత్యాన్ని కట్ చేస్తే అది గట్టి ప్లాస్టిక్ లేదా గాజుతో చేసినట్లు కనిపిస్తుంది.
5. గుండ్రటి పరీక్ష (Roundness Test)
అసలు ముత్యం సాధారణంగా పూర్తిగా గుండ్రంగా ఉండదు. కొద్దిగా తేడాలు ఉండవచ్చు. నకిలీ ముత్యం పూర్తిగా గుండ్రంగా, కచ్చితంగా కనిపిస్తుంది.
6. నీటిలో వేసి పరీక్షించండి
అసలు ముత్యం నీటిలో వేస్తే మునిగిపోతుంది. నకిలీ ముత్యం తేలికగా ఉండటం వల్ల కొన్నిసార్లు తేలుతుంది.
7. ముత్యం రుద్దే పరీక్ష (Rub Test)
రెండు ముత్యాలను ఒకదానితో ఒకటి నెమ్మదిగా రుద్దితే అసలు ముత్యం నుండి కొద్దిగా పొడిలాంటి పదార్థం వస్తుంది. కానీ నకిలీ ముత్యం నునుపుగా ఉంటుంది.