ప్రపంచంలోకెల్లా బిజీగా ఉండే విమానాశ్రయంగా ‘దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’తన స్థానాన్ని వరుసగా ఐదో ఏడాది నిలబెట్టుకున్నది. 2018లో రికార్డు స్థాయిలో గరిష్ఠ స్థాయిలో ప్రయాణికులు దుబాయి మీదుగా వెళ్లారు.

అత్యధికంగా భారతీయులు ప్రయాణించగా, గతేడాది దుబాయి విమానాశ్రయం మీదుగా ప్రయాణించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో 89 మిలియన్ల మందికి చేరుకున్నది. ఏడాది పొడవునా సాగే ట్రాఫిక్‌లో 2017తో పోలిస్తే స్వల్పంగా ఒక్కశాతం పెరిగి 89.15 మిలియన్ల మంది ప్రయాణికుల వద్ద స్థిరపడిందని దుబాయి్ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రయాణికుల రాకపోకల్లో నూతన రికార్డులను నమోదు చేసినా.. 90.3 మిలియన్ల మంది ప్రయాణికుల సంఖ్యను చేరుకోవాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని దుబాయి ఎయిర్ పోర్ట్ సీఈఓ పాల్ గ్రిఫ్ఫిట్స్ తెలిపారు.  

తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 2018 పొడవునా 8,91,49,387 మంది ప్రయాణికులు దుబాయి విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. అందులో భారతీయులే అత్యధికం. ముంబై, ఢిల్లీ, కోచి నగరాల నుంచి 12.2 మిలియన్ల మందికి పైగా భారతీయులు దుబాయి విమానాశ్రయాన్ని సందర్శించారు. 

తర్వాతీ స్థానంలో సౌదీ అరేబియన్లు ఉన్నారు. దుబాయి మీదుగా 6.4 మిలియన్ల మంది సౌదీ అరేబియన్లు ప్రయాణించగా, బ్రిటన్ జాతీయులు 6.3 మిలియన్ల మంది దుబాయి విమానాశ్రయాన్ని సందర్శించారు. చైనా నుంచి 3.5 మిలియన్ల విమాన సర్వీసులు, 3.2 మిలియన్ల అమెరికా, 1.5 మిలియన్ల విమానాలు రష్యా నుంచి దుబాయికి వచ్చాయి. 

గతేడాది రెండుసార్లు విమానాశ్రయాన్ని ఒక్క నెలలో 80 లక్షల మంది ప్రయాణికులు సందర్శించారు. జూలైలో 82 లక్షల మంది దాన్ని అధిగమించి ఆగస్టులో 84 లక్షల మంది సందర్శించారు. 1960లో విమాన సర్వీసులు ప్రారంభించినప్పటి నుంచి గతేడాది ఆగస్టు బిజీ నెలగా నిలిచింది.

2014లో వరల్డ్ బిజినెస్ హబ్‌గా పేరొందిన లండన్ హీత్రూ విమానాశ్రయాన్ని దుబాయి ఎయిర్ పోర్ట్ అధిగమించింది. గతేడాది 4.08 లక్షల విమానాలు దుబాయి మీదుగా ప్రయాణించాయి. ఇది 2017తో పోలిస్తే 0.3 శాతం తక్కువ. 1937లో దుబాయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (డబ్ల్యూఎక్స్‌బీ)ని పౌర విమాన సర్వీసుల కోసం తెరిచారు.