ITR filing deadline: మీరు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) ఫైల్ చేయకుంటే వెంటనే చేసేయండి, దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, ఈసారి రిటర్న్‌ల దాఖలు గడువును జూలై 31 తర్వాత పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది.
ITR filing deadline: ఈసారి చాలా వరకు ITR రిటర్నులు నిర్ణీత గడువులోగా ఫైల్ అవుతాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ప్రకారం, జూలై 20 వరకు, 2021-22 ఆర్థిక సంవత్సరానికి 2.3 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు అయ్యాయి.
ప్రతి రోజు గడిచేకొద్దీ రిటర్న్ ఫైలింగ్ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. దీనికి ముందు, గత ఆర్థిక సంవత్సరానికి 2020-21 కోసం సుమారు 5.89 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు అయ్యాయి. అయితే గత ఏడాది ప్రభుత్వం రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
రోజూ 15 నుంచి 18 లక్షల మంది రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు
రెవెన్యూ సెక్రటరీ తరుణ్ బజాజ్ ప్రకారం - ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు ప్రతిసారీ పొడిగించబడుతుందని ప్రజలు భావిస్తారు. అందుకే మొదట్లో రిటర్న్‌ల దాఖలులో ధీమాను ప్రదర్శిస్తారు. అయితే ఈసారి రోజుకు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు రిటర్నులు దాఖలవుతున్నాయి. ఈ సంఖ్య రోజుకు 25 నుంచి 30 లక్షల రిటర్న్‌లకు పెరుగుతుంది. గతేడాది చివరి రోజున 9-10 శాతం రిటర్నులు దాఖలయ్యాయి.
గతేడాది చివరి రోజున 50 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. ఈసారి ఆఖరు తేదీన కోటి రిటర్న్‌లను తీసుకునేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖాతాలను ఆడిట్ చేయనవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 2021-22 ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువు జూలై 31గా ఉంది. ఆదాయపు పన్ను శాఖ వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయం ఆధారంగా ఏడు రకాల ఆదాయపు పన్ను ఫారమ్‌లను సూచించింది.
చాలా త్వరగా రీఫండ్ అందుతోంది
పన్ను చెల్లింపుదారుల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం, రిటర్న్ ఫారమ్‌ను ఫైల్ చేయడం ఇప్పుడు చాలా సులభం అయ్యింది. అలాగే రిటర్న్ కూడా చాలా త్వరగా అందుతుంది. రిటర్న్‌లు దాఖలు చేయడంలో ఇబ్బందులకు సంబంధించిన ఫిర్యాదులపై రెవెన్యూ కార్యదర్శి బజాజ్ మాట్లాడుతూ, 2.3 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు లేకుండా రిటర్న్‌లు దాఖలు చేశారని తెలిపారు.
ఆయన తెలిపిన సమాచారం ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్ చివరి నిమిషంలో అధిక రిటర్న్‌లను తీసుకోవడానికి, వెబ్ ట్రాఫిక్ ను సమర్థ వంతంగా తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. గణాంకాల ప్రకారం, గతంలో రోజుకు 50,000 మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 20 లక్షలకు పెరిగింది. విశేషమేమిటంటే, కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును పొడిగించింది.
