Digilocker services on MyGov Helpdesk through WhatsApp : వాట్సప్‌లో ఒక్క మెసేజ్ చాలు. పాన్ కార్డు, డ్రెవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, టెన్త్, ఇంటర్ మార్క్ షీట్స్..ఇలా ఏ సర్టిఫికెట్ కావాలన్నా..క్షణాల్లో మీ ఫోన్లోకి వస్తోంది. ఆ సర్వీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

నేటి ఆధునిక యుగంలో ఐడెంటిటీ కార్డులు, డాక్యుమెంట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి, అవి లేకుంటే మీకు ఏ పని కూడా ముందుకు వెళ్లదు. బ్యాంకులో లోన్లు కావాలన్నా, పాస్ పోర్ట్ , లేదా ఏ ఇతర అధికారిక పని కోసం అయినా డాక్యుమెంట్స్ తప్పనిసరి ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ తయారు చేసిన డిజి లాకర్ అత్యంత ముఖ్యమైన యాప్ గా మారింది. ఇది స్మార్ట్ ఫోన్లో ఉంటే చాలు. మీరు ఫిజికల్ డాక్యుమెంట్లను క్యారీ చేయాల్సిన పనిలేదు. ఐతే డిజిలాకర్ యూజర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది.

ఇప్పుడు డిజిలాకర్ సేవలను వాట్సప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాట్సప్‌లో 9013151515 నెంబర్ ద్వారా ప్రజలు పాన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్, 10, 12 తరగతుల మార్క్ షీట్లు, టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ, ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్లు పొందవచ్చు.

దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసిస్తున్న పౌరులు ఇప్పుడు MyGov హెల్ప్‌డెస్క్ సహాయంతో WhatsApp ద్వారా డిజిలాకర్ సేవను ఉపయోగించవచ్చు. DigiLocker ద్వారా, ప్రజలు తమ ముఖ్యమైన పత్రాలను డిజిటల్ వాలెట్‌లో భద్రంగా ఉంచుకోవచ్చు. డిజిలాకర్‌లో జారీ చేయబడిన అన్ని పత్రాలు అసలైన ఫిజికల్ డాక్యుమెంట్స్ లాగే చెల్లుబాటు అవుతాయి.

MyGov హెల్ప్‌డెస్క్ సహాయంతో వాట్సాప్ ద్వారా తమ డిజిలాకర్‌ను ఉపయోగించవచ్చు. ఇది డిజిటల్ డాక్యుమెంట్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రభుత్వ పనిలో సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ కొత్త సర్వీస్ సహాయంతో డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేయడం, వెరిఫై చేయడం, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీ వంటి డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి పనులన్నీ వాట్సాప్ సహాయంతో చేయవచ్చు. 

సామాన్య ప్రజలు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవడం చాలా సులభం అవుతుంది. వీటితో పాటు, 10వ మరియు 12వ తరగతి మార్కు షీట్లు, వాహన బీమా పాలసీలతో సహా అనేక రకాల బీమా పాలసీల పత్రాలను కూడా డిజిలాకర్ ద్వారా దాచుకోవచ్చు. 

ఈ కొత్త సేవను ఉపయోగించడం కూడా చాలా సులభం. దీని కోసం, దేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే పౌరులు 'నమస్తే', 'హాయ్' లేదా 'డిజిలాకర్'ని అని వాట్సాప్ నంబర్ +91 9013151515కు పంపితే చాలు . MyGov హెల్ప్‌డెస్క్ ద్వారా డిజిలాకర్ సేవలను అందించడం ద్వారా కోట్లాది మంది ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారని MyGov CEO అభిషేక్ సింగ్ చెప్పారు. డిజిలాకర్‌లో ఇప్పటికే 100 మిలియన్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారని, దీని ద్వారా ఇప్పటివరకు 5 బిలియన్ల పత్రాలు జారీ అయ్యాయని ఆయన చెప్పారు.