ముంబై: తవ్వేకొద్దీ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్ఎల్‌) ప్రమోటర్ల అక్రమాలు బయటపడుతున్నాయి. వ్యాపారం పేరుతో బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి తీసుకున్న రుణాల్లో ప్రమోటర్లు దాదాపు రూ.20వేల కోట్లు దారిమళ్లించినట్టు సమాచారం. 

బ్యాంకుల తరఫున కేపీఎంజీ సంస్థ నిర్వహించిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. అయితే ఈ వార్తలపై కంపెనీగానీ, కేపీఎంజీగానీ అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు. కంపెనీ ఖాతాలు అనుమానాస్పదంగా ఉండడంతో డిహెచ్‌ఎ్‌ఫఎల్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కేపీఎంజీ ద్వారా ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌కు ఆమోదం తెలిపాయి. 

also read "సెంటర్స్ ఈక్విటీని తగ్గించండి": అభిజిత్ బెనర్జీ

‘మేము ఇంకా ఈ నివేదిక చూడలేదు. అయితే డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ రుణాలు సమకూర్చిన రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల అసలు విలువ-కంపెనీ అంచనా వేసిన ప్రాజెక్టు విలువ మధ్య తేడాలు ఉన్నాయి’ అని పేరు చెప్పేందుకు వెల్లడించని ఒక బ్యాంకర్‌ చెప్పారు.

నిధుల దారి మళ్లింపు నిజమైతే డీహెచ్‌ఎఫ్ఎల్‌ రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకం ప్రమాదంలో పడినట్టే. ఈ సంవత్సరం జూలై 6 నాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.83,873 కోట్లుగా ఉంది. అందులో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలే రూ.38,342 కోట్ల వరకు ఉంటాయి. కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని ఈక్విటీలో 51 శాతంగా మార్చేందుకు బ్యాంకులు సూత్రప్రాయంగా అంగీకరించాయి. 

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో బయటపడినట్టు చెబుతున్న ఈ విషయాలు నిజమైతే కంపెనీ రుణ పునర్‌ వ్యవస్థీకరణా మూలనపడినట్టే. అదే నిజమైతే బ్యాంకులు ఏకంగా కంపెనీ యాజమాన్యం మార్పునకు పట్టుబట్టే పరిస్థితి ఏర్పడనుంది. డీహెచ్‌ఎఫ్ఎల్‌ అనుబంధ సంస్థ ఎసెన్షియల్‌ హాస్పిటాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఈహెచ్‌పీఎల్‌), చరక్‌ ఫార్మా కంపెనీ మధ్య జరిగిన రూ.121 కోట్ల ఆర్థిక లావాదేవీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి పెట్టింది. 

చరక్‌ ఫార్మా మహారాష్ట్ర మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అల్లుడు రాజ్‌ షరాఫ్‌ నిర్వహణలోని కంపెనీ కావడం విశేషం. ఈహెచ్‌పీఎల్‌ కంపెనీ, చరక్‌ ఫార్మా కంపెనీకి ముంబైలోని ఒక ఏడంతస్తుల వాణిజ్య భవనాన్ని చరక్‌ ఫార్మా కంపెనీకి రూ.121 కోట్లకు విక్రయించి రిజిస్ట్రేషన్‌లో మాత్రం రూ.7 కోట్లుగా చూపింది. 

also read తాజా వివాదంలో ఇన్ఫోసిస్ సీఈఓ...

ఈహెచ్‌పీఎల్‌ అనేది ఆర్‌కేడబ్ల్యూ డెవలపర్స్‌ అనుబంధ సంస్థ. ఈ సంస్థకు డీహెచ్‌ఎ్‌ఫఎల్‌ ప్రమోటర్‌ అయిన ధీరజ్‌ వాద్వాన్‌ ప్రమోటర్‌, హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండటం గమనార్హం. డీహెచ్‌ఎఫ్ఎల్‌ ప్రమోటర్లకు గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం ముఠాతో ఉన్న సంబంధాలూ బయట పడుతున్నాయి. 

ఈడీ అధికారులు ఇటీవల 14 చోట్ల జరిపిన సోదాల్లో డీహెచ్‌ఎఫ్ఎల్‌ కంపెనీనీ ఇక్బాల్‌ మిర్చి నిర్వహణలోని సన్‌బ్లింక్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి 2010లో రూ.2,186 కోట్ల రుణాలు ఇచ్చిన పత్రాలు బయట పడ్డాయి. మిర్చి ఒకప్పుడు ముంబైలో దావూద్‌ ఇబ్రహీం టీంలో ముఖ్యమైన వ్యక్తి కావడం గమనార్హం.