న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో డ్రాగన్ దుశ్చర్య, తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీవాసులు చైనా వస్తువులపై ఏకంగా ‘యుద్ధం’ ప్రకటించారు. ఇంట్లోని ప్రతి చైనా వస్తువును రోడ్డుపైకి విసిరేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ రంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. 

దురదృష్టవశాత్తు తుపాకులు, బుల్లెట్లతో ప్రత్యక్షంగా  చైనాపై యుద్ధానికి దిగలేకపోయినా వస్తువులు బహిష్కరణతో  చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. అయితే ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని యుద్ధ నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ డిఫెన్స్ కాలనీకి చెందిన భవ్రీన్ కంధారి విమర్శించారు. 

మరోవైపు ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన సదర్ బజార్ వ్యాపారులు మాత్రం భిన్నంగా స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణకు సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కొన్ని షరతులు విధించారు. ఆ షరతులు అమలు చేస్తే మాత్రమే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు.

సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ శర్మమాట్లాడుతూ తాము కూడా చైనా ఉత్పత్తుల నిషేధానికి సిద్ధమే. 'హిందీచీనీ బైబై' నినాదానికి తమ మద్దతు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలతోపాటు, అధికారుల దాడులు, ఇతర వేధింపులనుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.  

also read నెరవేరిన ముకేశ్ అంబానీ కల.. 8 నెలల ముందే టార్గెట్ సక్సెస్..

దాదాపు 70 శాతం ఎలక్ట్రికల్ వస్తువులు చైనానుంచే వస్తాయని మరో వ్యాపారి తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా దీపావళి నాడు బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతామని వెల్లడించారు. అనేక మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు సంబంధించిన విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతి అవుతాయన్నారు. 

దాదాపు 40 వేల దుకాణాలను కలిగి ఉన్న సదర్ బజార్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, గడియారాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇలా దాదాపు ప్రతీది చైనా నుంచి దిగుమతి అయినవే ఉంటాయన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల బహిష్కరణ, దిగుమతులపై నిషేధం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

కాగా దేశీయంగా ఏడు కోట్ల మంది వ్యాపారులు, 40 వేల ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) చైనా దిగుమతులను నిషేధించాలని పిలుపు నిచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి  చైనా దిగుమతులు 13 బిలియన్ డాలర్లు తగ్గించాలంటూ ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. 

అంతేకాదు  బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని కోరింది. కానీ ప్రస్తుతం, ప్రతి ఏటా చైనా నుంచి దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విలువ 70 బిలియన్ డాలర్లకు పై మాటే.