న్యూఢిల్లీ: గుట్కా, పాన్ మసాల, పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయాలపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎల్ఆర్ గార్గ్ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ప్రజారోగ్య ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని గుట్కా, పాన్ మసాలాతోపాటు ఖర్ర, పొగాకు ఉత్పత్తులన్నింటిపై విధించిన నిషేధాన్ని ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతాల్లో మరో ఏడాది పొడిగిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

2015 నుంచి పొగాకు ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధాన్ని కొనసాగిస్తోంది. అయితే, సిగరెట్లపై ఎలాంటి నిషేధం విధించడం లేదని అధికారులు తెలిపారు.