ప్రపంచ మార్కెట్లు అస్థిరత దిశగా కదులుతున్న వేళ క్రిప్టో కరెన్సీలు ఎట్టకేలకు రికవరీ బాటపట్టాయి. బిట్ కాయిన్ 43 వేల డాలర్ల స్థాయిని దాటింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు సైతం తిరోగమనబాట పట్టడంతో ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు, ఈ ర్యాలీతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
ఉక్రెయిన్ యుద్ధం దెబ్బ నుంచి స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా కోలుకుంటున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీల్లో మాత్రం ర్యాలీ మాత్రం వేగంగా పుంజుకుంది. ప్రస్తుతం ఈరోజు క్రిప్టోకరెన్సీ మార్కెట్ ను గమనించినట్లయితే, బిట్‌కాయిన్ మునుపటి సెషన్‌లో 39,000 డాలర్ల నుంచి దిగువన ట్రేడ్ చేసినప్పటికీ, ప్రస్తుతం 43,000 డాలర్ల పైకి ఎగబాకింది. Bitcoin ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందింది. ఈ క్రిప్టో కరెన్సీ ఏకంగా క్రితం సెషన్ కన్నా కూడా ఏకంగా 13 శాతం కంటే ఎక్కువ పెరిగి ప్రస్తుతం 43,549 డాలర్లకి చేరుకుంది.
CoinGecko ప్రకారం గత 24 గంటల్లో గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు 10% కంటే ఎక్కువ 2 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. అదే సమయంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఎథేరియం కూడా 10 శాతం కంటే ఎక్కువ లాభపడి 2,912 డాలర్లకు చేరుకుంది. మరోవైపు Dogecoin కూడా దాదాపు 7 శాతం లాభపడి 0.13కి చేరుకుంది, అయితే Shiba Inu కూడా 8 శాతం పైగా లాభపడి 0.0000026 డాలర్ల స్థాయికి చేరుకుంది.
గత కొన్ని వారాలుగా పెరుగుతున్న ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో అస్థిరత నెలకొని ఉంది. ముఖ్యంగా అమెరికన్, ఆసియా మార్కెట్లు తిరోగమనబాట పట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ అసెట్ క్లాస్ వైపు కదులుతున్నారు. వీటిలో బంగారం, క్రిప్టోకరెన్సీ సరైన ఎంపికగా నిపుణులు భావిస్తున్నారు. అయితే కష్ట సమయాల్లో క్రిప్టో కరెన్సీ మంచి పెట్టుబడి ఎంపికగా ఉండవచ్చనే వాదన బలపడుతోంది.
కానీ డిజిటల్ టోకెన్ 2022లో ఇప్పటివరకు దాదాపు 19 శాతం తగ్గింది (గత సంవత్సరం ఈ నెలతో పోల్చి చూస్తే), నవంబర్ 2021లో దాని ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 69,000 డాలర్ల నుండి 29 శాతం కంటే ఎక్కువ నష్టపోయింది. నవంబర్ ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకినప్పటి నుండి క్రిప్టో ధరలు తగ్గుతున్నాయి. ఇటీవలి గ్లోబల్ అస్థిరత కారణంగా భారీ అమ్మకాల నేపథ్యంలో ఈ పరిస్థితి వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.
నిజానికి బంగారానికి ప్రత్యామ్నాయ అసెట్ క్లాస్ గా పేర్కొన్న క్రిప్టో కరెన్సీలు, ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం నేపథ్యంలో మాత్రం సేఫ్ కాదని ఒక సందర్భంలో తేల్చాయి. గత పదిహేను రోజుల మార్కెట్ సరళిని పరిశీలిస్తే క్రిప్టో మార్కెట్ కనిష్ట స్థాయిని తాకింది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ దాదాపు నవంబర్ నాటి ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్లతో పోలిస్తే సగానికి పడిపోవడం గమనించాల్సిందే. అలాగే రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం కూడా దాదాపు అంతే శాతం పతనమైంది.
