ఈ ఏడాది దేశ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అమెరికా కేంద్ర బ్యాంకు.. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్షలో అంచనా వేయడంతో ప్రపంచ ఆర్థిక పురోగతిపై ఆందోళనలు పెరిగాయి. 2020లో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి పెరిగే వీలున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ పేర్కొంది.

దీంతో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ముడిచమురు ధరలకూ ఈ సెగ తగిలింది. వెరసి గురువారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 7 శాతం పతనమై 39 డాలర్ల దిగువకు చేరింది. ఈ బాటలో న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 8 శాతం పడిపోయి 36.4 డాలర్లను తాకింది.

దీంతో ఏప్రిల్‌ తదుపరి తిరిగి ఒకే రోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఇక ప్రస్తుతం మరోసారి అమ్మకాలు పెరగడంతో నేలచూపులతో కదులు తున్నాయి. బ్రెంట్‌ బ్యారల్‌ 1.5 శాతం క్షీణించి 37.97 డాలర్లకు చేరగా.. నైమెక్స్‌ బ్యారల్‌ దాదాపు 2 శాతం నీరసించి 35.68 వద్ద ట్రేడవుతోంది.

ఈ నెల 5వ తేదీతో ముగిసిన వారంలో వాణిజ్య చమురు నిల్వలు 5.7 మిలియన్‌ బ్యారళ్లమేర పెరిగినట్లు యూఎస్‌ ఇంధన ఏజెన్సీ తాజాగా వెల్లడించింది. ఫలితంగా చమురు నిల్వలు 538 మిలియన్‌ బ్యారళ్లను అధిగమించినట్లు తెలిపింది. తద్వారా చమురు నిల్వలు సరికొత్త రికార్డ్‌ గరిష్టానికి చేరుకున్నట్లు పేర్కొంది.

also read పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..నేడు మళ్ళీ పెంపు..

గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్‌ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదైనట్లు అమెరికా ఇంధన ఏజెన్సీ తెలిపింది. నిజానికి 1.45 మిలియన్‌ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోనున్న భయాలు ప్రధానంగా చమురు వర్గాలలో ఆందోళనలకు దారితీసినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 

కరోనా ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం బారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. ఇది చమురు డిమాండ్‌ను దెబ్బతీయవచ్చన్న అంచనాలు అమ్మకాలకు కారణమైనట్లు వివరించారు. 

అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్‌ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్‌డౌన్‌లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరచినట్లు ఇంధన వర్గాలు వెల్లడించాయి.