రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తర్వాత కోలుకుంటున్న దేశాలకు ఈ యుద్ధం శాపంలా మారింది. ఈ యుద్ధానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పద్నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. కరోనా తర్వాత కోలుకుంటున్న దేశాలకు ఈ యుద్ధం శాపంలా మారింది. ఈ యుద్ధానికి ప్రపంచం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చమురు ధరలు పెరిగితే, రవాణా ఖర్చులు పెరిగి, ఆహారం నుండి అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్భణంకు దారి తీస్తుంది. ఇది ప్రపంచానికి సంకటంగా మారింది. బ్రెంట్ క్రూడ్ ధరలు 130 డాలర్లను, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 126 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. క్రితం సెషన్‌లో బ్రెంట్ 130 డాలర్లను కూడా క్రాస్ చేసింది. భారత్‌లో ప్రామాణికంగా భావించే బ్రెంట్ ఓ సమయంలో 139 డాలర్లను తాకి, కిందకు వచ్చింది. ఇది 14 ఏళ్ల గరిష్టం. చివరిసారి 2008లో ఈ ధరలు కనిపించాయి.

రేపో మాపో ధరల పెరుగుదల 

భారత్‌లో రేపో, మాపో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీపావళి నుండి ఈ ధరల్లో మార్పులేదు. కాబట్టి ఇప్పుడు పెద్ద మొత్తంలో ఉండవచ్చునని తెలుస్తోంది. సరిగ్గా పెంపు సమయానికి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఈ నాలుగు నెలల కాలంలో డబుల్ అయ్యాయి. అంటే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. విడతలవారీగా రూ.120 వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే కేంద్రం సెస్ తగ్గింపు వంటి అంశాలు భారం తగ్గడానికి ఉపయోగపడవచ్చు.

చమురు ధరలపై ప్రభావం 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతింటుంది. దీంతో చమురు ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరోవైపు, అమెరికా, యూరోప్ దేశాలు రష్యా పైన కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా నుండి దిగుమతి అయ్యే చమురుపై మాత్రం నియంత్రణ లేదు. అయితే పుతిన్ దూకుడు తగ్గించేందుకు మాస్కోపై చమురు ఎగుమతుల ఆంక్షల దిశగా చూస్తున్నాయి అమెరికా, యూరోప్ దేశాలు. అప్పుడు ప్రపంచ చమురు అవసరాల్లో పది శాతం వాటా కలిగి ఉన్న రష్యా నుండి నిలిచిపోతే ధరలు 150 డాలర్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు ఆలస్యమవుతున్నాయి. ఈ డీల్ కుదిరితే ఇరాన్ పైన ఆంక్షల ఎత్తివేతకు చూస్తోంది అమెరికా. అప్పుడు రష్యా స్థానాన్ని ఇరాన్ భర్తీ చేస్తుంది. కానీ చర్చలు కొలిక్కి రావడం లేదు. ఇలా వివిధ కారణాలు చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. యుద్ద ప్రభావం గ్యాస్ ధరల పైన కూడా పడింది. అమెరికాలో సాధారణ గ్యాస్ గ్యాలెనన్ ధర 4 డాలర్లకు చేరుకుంది. 2008 తర్వాత ఇదే మొదటిసారి.

ఉక్రెయిన్ పైన దాడి, బాంబు దాడి జరిగినప్పటికీ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయాలనే తమ నిర్ణయాన్ని షెల్ (SHELL) సమర్థించుకుంది. రష్యా నుండి చమురును కొనుగోలు చేసినట్లు ధృవీకరించింది. ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా.. షెల్ రష్యా చమురు కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా చమురులో మీకు ఉక్రెయిన్ రక్తపు వాసన కనిపించడం లేదా? అని ట్వీట్ చేశారు. కానీ ప్రత్యామ్నాయం లేదని షెల్ చెబుతోంది.సౌదీ అరేబియా తర్వాత క్రూడ్ ఉత్పత్తిలో రష్యా రెండో స్థానంలో ఉంది. యూరోపియన్ దేశాలకు అవసరమైన మూడో వంతు చమురును ఉత్పత్తి చేస్తోంది. అయితే యూరోప్‌లో సరైన సరఫరా కోసం కొనుగోలు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపింది.