ముంబై: కరోనా సంక్షోభంతో దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) భారీగా పెరగవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌, తత్ఫలితంగా కుంచించుకుపోయిన అభివృద్ధితో బ్యాంకుల మొండి బాకీలు పెరగడంతో పాటు మూలధనం హరించుకుపోవచ్చన్నారు. 
ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ఏడో వార్షిక సదస్సులో ఆయన ప్రసంగిస్తూ సరఫరా వ్యవస్థల పూర్తి స్థాయి పునరుద్ధరణతోపాటు గిరాకీ సాధారణ స్థితికి చేరుకునేందుకు ఎంత కాలం పడుతుందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక వృద్ధి అవకాశాలపై అనిశ్చితి నెలకొందన్నారు.

మార్చి 25న మొదలైన లాక్‌డౌన్‌.. ఏప్రిల్‌ చివరి వరకు కొనసాగింది. మే నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో దేశీయ పారిశ్రామికోత్పత్తి, వినియోగం పతనమైంది. పర్యవసానంగా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక జీడీపీ వృద్ధి భారీగా క్షీణించవచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశం మహా మాంద్యాన్ని చవిచూడనుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

గడిచిన 100 ఏళ్లలో ఇదే అతిపెద్ద ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ పారిశ్రామికోత్పత్తి, ఉద్యోగాలు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోందన్న సంకేతాలందుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. పేర్కొన్నారు. మార్కెట్‌ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం, వృద్ధి పునరుద్ధరణ, వేగంగా కోలుకోవడంపైన దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులకు మూలధన పునర్వ్యవస్థీకరణ ఆవశ్యకత పెరిగిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించరు. 2008నాటి ఆర్థిక మాంద్యం, ప్రస్తుత సంక్షోభాల ప్రభావం ఎవరి అంచనాలకు అందనిదన్నారు. 

ఈ సమయాల్లోనే ఆర్థిక సేవల వ్యవస్థ భారీ స్థాయిలో మూలధన నిధులు కలిగి ఉండాలన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటు ను 2.50 శాతం తగ్గించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గుర్తు చేశారు.
మార్కెట్‌కు రూ.9.57 లక్షల కోట్ల మేర నిధులను సమకూర్చిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మొండి బకాయిల నిబంధనలను సడలించడంతో పాటు రుణగ్రహీతలకు ఈఎంఐ చెల్లింపులకు మారటోయం వసతిని సైతం కల్పించిందన్నారు.

మార్కెట్‌ వర్గాల్లో విశ్వాసం, ద్రవ్య కొరత తగ్గింపు. రుణ వితరణతోపటు ఉత్పత్తి అవసరాల కోసం ఆర్థిక వనరుల లభ్యతను పెంచడం వంటి చర్యలను ఆర్బీఐ చేపట్టిందని శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేపట్టిన సంప్రదాయ, అసాధారణ పరపతి విధానం, ద్రవ్య చర్యల ప్రధానోద్దేశమిదేనన్నారు.

also read:డ్రాగన్’కు షాక్: భారత్ వైపే ఆపిల్ మొగ్గు.. బిలియన్ డాలర్ల పెట్టుబడులు !

కరోనా సంక్షోభం నుంచి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన సంస్కరణలు వృద్ధికి దోహదపడనున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా సంక్షోభం తర్వాత కంపెనీలు వస్తు ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు సరికొత్త వ్యూహాలను అనుసరించవచ్చునన్నారు.

తద్వారా ఆర్థిక వృద్ధికి కొత్త చోదకాలు ఆవిర్భవించవచ్చునని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.  ఆర్థిక వృద్ధి రేటు పెంపునకే అత్యధిక ప్రాధాన్యం. ఆర్థిక స్థిరత్వానికీ అంతే స్థాయి ప్రాధాన్యం లభిస్తుందని చెప్పారు.

ఆర్థిక స్థిరత్వం, బ్యాంకింగ్‌ రంగ పటిష్ఠత, నిలకడైన ఆర్థిక కార్యకలాపాల మధ్య సమతుల్యతను కొనసాగించేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోందని శక్తికాంత దాస్ అన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యల ఉపసంహరణలో ఆర్‌బీఐ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

కరోనా సంక్షోభ ప్రభావ తీవ్రతలోనూ దేశ ఆర్థిక సేవల వ్యవస్థ ఎలాంటి అవాంతరాలు లేకుండా పనిచేస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వానికి భంగం కలిగించే అవకాశాలను పరిశీలించేందుకు ఆర్‌బీఐ పర్యవేక్షణ వ్యవస్థను కూడా ఆధునీకరించుకుందన్నారు. లాక్‌డౌన్‌తో ఆర్‌బీఐ క్షేత్రస్థాయి పర్యవేక్షణకు కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పారు. దీంతో ఆఫ్‌ సైట్‌ నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తున్నాం అని తెలిపారు.  

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సదా అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ సూచించారు. ‘‘ప్రతి ఆర్థిక సంస్థ, ముఖ్యంగా బ్యాంక్‌లు తమపై కొవిడ్‌ ప్రభావ తీవ్రతను అంచనా వేసుకోవాలి. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ బలాలు, బలహీనతలను గుర్తించాలి. భవిష్యత్‌లో ఈ తరహా సంక్షోభాలు మరిన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. వాటిని ఎదుర్కొనేందుకు ఆర్థిక సేవల రంగం సిద్ధంగా ఉండాలి’’ అని అభిప్రాయపడ్డారు. 

అంతర్గత పాలన, కార్యకలాపాలతోపాటు ముప్పు తగ్గించుకునేందుకు అవసరమైన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని శక్తికాంత దాస్ అన్నారు. ‘‘సంక్షోభాలను ముందుగానే గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమీకరించుకోవాలి. రుణ వృద్ధి, త్వరితగతి పునరుద్ధరణకు అత్యవసర నిల్వలు, తగినంత మూలధనం చాలా కీలక’’మని ఆయన పేర్కొన్నారు.  

ఆర్థిక సేవల సంస్థల సంక్షోభ పరిష్కారం, వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం చట్టబద్ధమైన ‘పరిష్కార సంస్థ’ను ఏర్పాటు చేయాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ సూచించారు. ‘‘ఆర్‌బీఐ తనవంతుగా ముందస్తు హెచ్చరిక లు జారీ చేస్తుంది. పొంచి ఉన్న ముప్పులపై ముందే అప్రమత్తం చేస్తుంది. నియంత్రణ సంస్థగా అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ సంక్షోభ పరిష్కారాల కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలి’’ అని అన్నారు.