న్యూ ఢీల్లీ: రిటైల్ చైన్ డిమార్ట్‌ను సొంతం చేసుకుని, నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ 2020 జూన్ 30తో ముగిసిన త్రైమాసిక నికర లాభంలో 88% పడిపోయిందని శనివారం నివేదించింది.

నికర లాభం 40 కోట్లకు తగ్గడానికి కోవిడ్ -19 కారణమని కంపెనీ పేర్కొంది. అంతకుముందు (2019-20) క్యూ1లో  323 కోట్ల రూపాయల  నికర లాభాన్ని నివేదించింది. అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లే నోరోన్హా సంస్థ ఆర్థిక పనితీరుపై మాట్లాడుతూ కోవిడ్ -19 దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తుంది.

లాక్ డౌన్, ఆంక్షలు, డిమాండ్‌ క్షీణించడం వంటి అంశాల కారణంగా ఈ‌  త్రైమాసికంలో మా కార్యాచరణ, ఆర్థిక పనితీరుపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. గత ఏడాది త్రైమాసికంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో మా ఆదాయం, ఈ‌బి‌ఐ‌టి‌డి‌ఏ, పిఎటి గణనీయంగా పడిపోయింది.

also read ఆగస్ట్‌ తర్వాత మారిటోరియంపై క్లారీటి ఇచ్చిన ఎస్‌బీఐ ఛైర్మన్‌ ...

కంపెనీ మొత్తం ఆదాయం 32 శాతం పడిపోయి 3,933 కోట్ల రూపాయలకు చేరుకుంది. కిందటి ఏడాది జూన్ 2019లో 5,826 కోట్ల రూపాయలు ఆర్జించింది. క్యూ1 ఎఫ్‌వై 21లో వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచన (ఇబిఐటిడిఎ) ముందు ఆదాయాలు 112 కోట్లుగా ఉన్నాయి, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 597 కోట్లు. మార్జిన్లు 4.5 శాతం  క్షీణించి 1 శాతానికి చేరాయి. శుక్రవారం, బిఎస్‌ఇలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ స్క్రిప్  0.04% పెరిగి 2,322.15 వద్ద ముగిసింది.

 అయితే స్టోర్లను అనుమతిస్తున్న సమయం, ఇతర ఆంక్షల కారణంగా నిత్యావసరాల విక్రయాలు మాత్రమే జోరందుకున్నట్లు వివరించింది. ఇతర (నాన్‌ఎఫ్‌ఎంసీజీ) ప్రొడక్టులకు డిమాండ్‌ తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఇకపై కంపెనీ పనితీరుపై అనిశ్చితి ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది.