భారత్‌లో వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలనే నిబంధన ఉందని తెలిసిందే. దేశంలోని చిన్న చిన్న గ్రామాల్లో కూడా వాహనాలు నడుపుతున్నారు. వాహనం నడిపే ప్రతీ ఒక్క భారతీయుడికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లైసెన్స్ అనేది చట్టబద్దమైన హక్కు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లైసెన్స్ కలిగి ఉండకపోతే శిక్షార్హులుగా చట్టం చెబుతోంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సమగ్ర సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌లు:
లెర్నర్ లైసెన్స్: ఇది డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తులకు జారీ చేసే లైసెన్స్. ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యే ఈ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్: RTO నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే ఇండ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇది హోల్డర్‌ను నిర్దిష్ట రకమైన వాహనాన్ని నడపడానికి అనుమతిస్తుంది.
కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్: ట్రక్కులు, బస్సులు, టాక్సీలు మొదలైన పబ్లిక్ సర్వీస్ వాహనాలను నడిపే వ్యక్తులకు ఈ రకమైన లైసెన్స్ జారీ చేస్తారు.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP): ఈ లైసెన్స్ విదేశాల్లో డ్రైవింగ్ చేయడానికి జారీ చేస్తారు.
భారతదేశంలో ఏ రకమైన వాహనానికి ఏ లైసెన్స్ అవసరమో చూద్దాం:
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్:
MC 50CC (మోటార్ సైకిల్ 50CC) - మోటారు సామర్థ్యం 50CC లేదా అంతకంటే తక్కువ
MCWOG/FVG కలిగిన వాహనాలు - ఏదైనా ఇంజిన్ రకం కానీ గేర్ లేకుండా ఉండేవి.
LMV-NT - రవాణాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించే తేలికపాటి మోటారు వాహనాలు.
MC EX50CC - గేర్‌తో కూడిన మోటార్‌సైకిళ్లు, 50CC లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లు, కార్లతో సహా లైట్ మోటార్ వెహికల్స్ (LMV)
MC విత్ గేర్ లేదా M/CYCL.WG గేర్‌తో కూడిన అన్ని మోటార్‌సైకిళ్లు
వాణిజ్య వాహనాల కోసం: మోటారు కార్లు, జీప్‌లు, టాక్సీలు, డెలివరీ వ్యాన్‌లు HMV హెవీ మోటారు వాహనాలతో సహా MGV మీడియం గూడ్స్ వెహికల్స్, LMV లైట్ మోటారు వాహనాలు, HGMV హెవీ గూడ్స్ మోటార్ వెహికల్, HPMV/HTV హెవీ ప్యాసింజర్, హెవీ వెహికల్స్. భారీ వాహనం కోసం డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి హెవీ ట్రైలర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి వయస్సు అర్హత, ప్రమాణాలు:
50cc వరకు ఇంజిన్ సామర్థ్యంతో గేర్లు లేని వాహనాలు - తప్పనిసరిగా 16 సంవత్సరాల వయస్సు ఉండాలి, తల్లిదండ్రుల సమ్మతి అవసరం.
గేర్లు ఉన్న వాహనాలు - 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి.
వాణిజ్య వాహనాలు - 20 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి (కొన్ని రాష్ట్రాల్లో 18 సంవత్సరాలు) అలాగే కనీసం 8వ తరగతి వరకు అధికారిక విద్యను పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొంది ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు:
భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి కింద పేర్కొన్న పత్రాలు అవసరపడతాయి.
వయస్సు రుజువు: జనన ధృవీకరణ పత్రం, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్ అవసరం ఉంటాయి.
ఐడీ ప్రూఫ్: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి.
అడ్రస్ ప్రూఫ్: ఇంటి చిరునామా, విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి.
ఇతర పత్రాలు అవసరం:
లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు కావాలి.
దరఖాస్తు ఫీజు: 40 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులకు మెడికల్ సర్టిఫికేట్‌తో పాటు పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్ తప్పనిసరిగా ఉండాలి.
ఇది కూడా చదవండి: లైసెన్స్ ఇంటి దగ్గర మర్చిపోయారా? అయినా ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టక్కరలేదు
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి.?
మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ విధానం:
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
1: ముందుగా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
2: 'డ్రైవర్ లైసెన్స్ సంబంధిత సేవలు'పై క్లిక్ చేసి, ఆపై 'ఆన్‌లైన్ సేవలు' సెలక్ట్ చేసుకోవాలి.
3: రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
4: 'డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు'పై క్లిక్ చేయాలి.
5: 'కంటిన్యూ'పై క్లిక్ చేయండి.
6: ఇప్పుడు దరఖాస్తును ఫిల్ చేసి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. పరీక్షకు హాజరు కావడానికి సీటు బుక్ చేసుకోవాలి, అలాగే ఫీజు చెల్లించాలి.
7: మీరు ఎంచుకున్న తేదీ, సమయంలో RTO కార్యాలయంలో అధికారిని కలవండి
8: మీరు డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యాక, లైసెన్స్ నమోదు చేసిన అడ్రస్‌కు లైసెన్స్ వస్తుంది.
డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలి.? రెన్యువల్ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
గమనిక: కొత్త నియమం ప్రకారం, అభ్యర్థులు తమ డ్రైవింగ్ పరీక్షను గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లో కూడా పూర్తి చేసుకోవచ్చు. RTO వద్ద డ్రైవింగ్ టెస్ట్ తీసుకోవడం ఇకపై తప్పనిసరి కాదన్నమాట.
ఆఫ్‌లైన్ విధానం:
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
1: ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫామ్‌ను తీసుకోవాలి. లెర్నర్ లైసెన్స్ కోసం ఫారం 1, శాశ్వత లైసెన్స్ కోసం ఫారం 4ను తీసుకోవాలి. ఈ ఫామ్ ఆన్‌లైన్‌లో రాష్ట్ర రవాణా వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని RTO కార్యాలయంలో అందుబాటులో ఉంటుంది.
2: ఫారమ్‌ను ఫిల్ చేసి వయస్సు, అడ్రస్ ప్రూఫ్‌తో పాటు స్థానిక ఆర్టీఓ ఆఫీసును సంప్రదించండి. RTO అధికారుల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష తేదీని అడగాలి, అలాగే సంబంధిత ఫీజును చెల్లించాలి.
3: షెడ్యూల్ చేసిన సమయం తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష వేదిక వద్దకు చేరుకోవాలి. మీరు పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీ డ్రైవింగ్ లైసెన్స్ మీ నమోదిత అడ్రస్‌కు పంపిస్తారు.
మీ డ్రైవింగ్ స్కూల్‌లోని సిబ్బంది మీ లైసెన్స్‌ని పొందడంలో మీకు సహాయపడగలరు. భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మారుతుంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్‌ని ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలంటే..
1: ఇందుకోసం ముందుగా ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. https://parivahan.gov.in/parivahan//en
2: 'డ్రైవర్ లైసెన్స్ సంబంధిత సేవలు'పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి.
3: రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
4: అనంతరం 'అప్లికేషన్ స్టేటస్'పై క్లిక్ చేయాలి.
5: అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి.
6: చివరిగా 'సబ్‌మిట్' పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. దీనికి బదులుగా మీరు ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లి కూడా సంప్రదించవచ్చు.
టూ వీలర్స్ కోసం పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం పరీక్షా విధానం: టూ వీలర్ డ్రైవింగ్ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కోసం, మీరు సాధారణంగా ఫిగర్ 8 ఆకారంలో ఉండే సైకిల్‌లో వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. అభ్యర్థి ఎంపికకు దీన్ని పరీక్షగా పెడతారు. నిర్ణీత మార్గంలో కాలు కింద పెట్టకుండా రౌండ్ వేయాల్సి ఉంటుంది.
ఫోర్ వీలర్స్‌కి: దరఖాస్తుదారు తప్పనిసరిగా ఫారమ్ నంబర్ 8లో వాహనం నడపాలి. ముందుకు వెళ్లడం, రివర్స్ గేర్ వేయడం, పార్క్ చేయడం, అద్దంలో చూస్తూ డ్రైవింగ్ చేయడం, గేర్‌లను మార్చడం, బ్రేక్ వేయడం వంటి సామర్థ్యాలను చెక్ చేస్తారు.
భారతదేశంలో అంతర్జాతీయ డ్రైవింగ్ అనుమతి:
రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (RTA) విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (IDP) జారీ చేస్తుంది. పత్రం చెల్లుబాటు అయితే ఏదైనా విదేశీ దేశంలో డ్రైవింగ్ అనుమతిస్తారు. మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (IDP) మీ వెంట ఉండటం తప్పనిసరి.
డ్రైవింగ్ లైసెన్స్‌పై తరచుగా అడిగే ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇవే..
ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్‌ని ఎల్లవేళలా తన వెంట తీసుకెళ్లాలా?
అవును, ఇది ఎల్లప్పుడూ మీతో ఉండాలి. రహదారిపై డ్రైవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే చట్టపరమైన డాక్యుమెంట్ ఇదే.
డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫామ్‌ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయడం సాధ్యమేనా?
మీరు డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫామ్‌ను మీ రాష్ట్ర మోటారు వాహనాల శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే పరిణామాలు ఏమిటి?
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడితే జరిమానాలు, జైలు శిక్షతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం వంటివి ఉంటాయి. అలాగే చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ మీ మోటారు బీమా కవరేజీని రద్దు చేయవచ్చు.
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ ఎంతకాలం చెల్లుబాటవుతుంది?
శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసిన తేదీ నుండి 20 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది.
భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?
డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ స్థితిని పరివాహన్ పోర్టల్‌లో ట్రాక్ చేయవచ్చు.
డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌లో ఏముంటుంది?
ప్రతి డ్రైవింగ్ లైసెన్స్ రాష్ట్రం పేరు, బ్రాంచ్ కోడ్, జారీ చేసిన సంవత్సరం, డ్రైవర్ ప్రొఫైల్ ID అంటే 13 అక్షరాల సంఖ్యను కలిగి ఉంటుంది.
డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలా.?
డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి సాధారణంగా మెడికల్ సర్టిఫికేట్ అవసర పడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా ఏమిటి?
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5000 వరకు జరిమానా, 3 నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధిస్తారు.
డ్రైవింగ్ లైసెన్స్‌పై నా చిరునామాను నేను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చా?
మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మీ చిరునామాను ఆన్‌లైన్‌లో మార్చలేరు, కానీ మీరు ఆన్‌లైన్‌లో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ధృవీకరణ కోసం ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) సంప్రదించవచ్చు.
భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ వేరే దేశంలో డ్రైవింగ్ చేయడానికి ఉపయోగించవచ్చా?
భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ మరొక దేశంలో డ్రైవింగ్ చేయడానికి ఉపయోగించరాదు. దీని కోసం అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలి.
భారతదేశంలో శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎన్ని రోజులు పడుతుంది?
మీరు డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, మీరు అందించిన చిరునామాకు 30 రోజులలోపు మెయిల్ ద్వారా మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను పొందవచ్చు. అయితే ఇప్పుడు రెండు రోజుల్లో అందుబాటులోకి వస్తోంది.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎంత వయసు ఉండాలి.?
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి, మీకు కనీసం 18 ఏళ్లు ఉండాలి.
