లైసెన్స్ ఇంటి దగ్గర మర్చిపోయారా? అయినా ట్రాఫిక్ పోలీసులకు ఫైన్ కట్టక్కరలేదు
ఇంటి దగ్గర డాక్యుమెంట్లు మర్చిపోవడం వల్ల మీరెప్పుడైనా ట్రాఫిక్ పోలీసుకు భారీగా ఫైన్ కట్టారా? ఇకపై మీరు అంత భారీ ఫైన్లు కట్టాల్సిన అవసరం లేదు. మరేం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.
ట్రాఫిక్ పోలీసులకు మనం చాలా సార్లు ఫైన్లు కట్టి ఉంటాం కదా.. కాని వాటికి రకరకాల కారణాలు ఉంటాయి. హెల్మెట్ లేదని, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇలాంటి డాక్యుమెంట్స్ లేవని జరిమానాలు కడతాం. కాని ట్రాఫిక్ పోలీసు మిమ్మల్ని ఆపినప్పుడు డాక్యుమెంట్స్ ఇంటి దగ్గరే మర్చిపోయానని చెప్పి మీరెప్పుడైనా ఫైన్ కట్టారా? ఒకవేళ మీరు ఇంటి దగ్గర డాక్యుమెంట్స్ మర్చిపోతే మీరు వేలకు వేలు ఫైన్ కట్టాల్సిన పనిలేదు.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు వెహికల్ చెకింగ్ కోసం వాహనాలు ఆపుతుంటారు. ముఖ్యంగా జాతీయ రహదారులకు సమీపంలో ఉండే రోడ్లు, సిటీలు, టౌన్ల చివర, అక్రమ వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయని అనుమానం ఉన్న చోట వెహికల్ చెకింగ్ ఎక్కువగా జరుగుతుంటుంది. హెల్మెట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇలాంటి వాటిని అడుగుతారు.
వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా ఫైన్ కట్టక తప్పదు. ఒక్కో సారి ఆ ఫైన్ రూ. వేలల్లోనే ఉంటుంది. అయితే పోలీసులు అడిగిన డాక్యుమెంట్లు ఇంటి దగ్గర మర్చిపోతే మీరు భారీ ఫైన్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భంలో మీరేం చేయాలంటే ఇంటి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి చూపిస్తానని చెప్పండి. అయినా పోలీసులు వినకుండా మీకు ఫైన్ వేయడానికి ప్రయత్నిస్తే ఈ సెక్షన్లు వారికి గుర్తు చేయండి.
మోటార్ వెహికల్ యాక్ట్ 139 ప్రకారం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి అన్ని డాక్యుమెంట్స్ ఉండి, పోలీసులు చెక్ చేస్తున్నప్పుడు చూపించలేకపోతే తర్వాత స్టేషన్ కి వచ్చి ఆ డాక్యుమెంట్స్ చూపించడానికి అవకాశం ఇవ్వాలి. అంటే డాక్యుమెంట్స్ ఇంటి దగ్గర మర్చిపోవడం, వేరే చోట వదిలేయడం చేస్తే పోలీసులు పట్టుకున్న 15 రోజుల్లోపు డ్రైవర్ ఆ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి పోలీసులకు చూపించాలి.
అలా 15 రోజుల్లోపు పోలీసులు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తే పోలీసులు ఒక్కో డాక్యుమెంటుకు రూ.100 చొప్పున ఫైన్ తీసుకొని వదిలేస్తారు. ఇకపై మీకెప్పుడైనా ఈ పరిస్థితి ఎదురైతే ఇలా చేయండి.