సెమీకాన్ ఇండియా 2024 : 2017 కు ముందు, తర్వాత ... యూపీలో తేడా ఇదే : సీఎం యోగి
సెమీకాన్ ఇండియా 2024 సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2017 తర్వాత రాష్ట్రంలోని అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు...అందువల్లే భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు.
గ్రేటర్ నోయిడా: సెమీకాన్ ఇండియా 2024 ప్రారంభోత్సవం సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఐటీచ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ... 2017కి ముందు ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉండేదన్నారు కానీ నేడు రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని... పెట్టుబడులు పెద్దఎత్తున వస్తున్నాయని అన్నారు.
నేడు ఉత్తరప్రదేశ్‌లో చట్టాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వ్యాపారానికి అనువైన వాతావరణం ఉందన్నారు. అందుకే నేడు ప్రతి ఒక్కరూ ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని యోగి తెలిపారు.
2017 నుండి 2024 వరకు గణనీయమైన మార్పులు
2017కి ముందు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని తేడాను వివరించారు యోగి ఆదిత్యనాథ్. 2017లో తాము ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించాలని భావించినప్పుడు కేవలం రూ.20,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే సాధ్యమవుతాయని తమకు చెప్పారని సీఎం యోగి గుర్తు చేసుకున్నారు. అయితే గతేడాది నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ.40 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని... ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఆయన తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఎంతగా మారిందో చెప్పడానికి నిదర్శమని అన్నారు.
సెమీకండక్టర్ విధానంతో పెట్టుబడిదారులకు మార్గం సుగమం
గత ఏడు సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కష్టపడ్డారని సీఎం యోగి అన్నారు. నేడు పెట్టుబడిదారుల సమస్యలన్నింటినీ నిర్ణీత సమయంలోగా పరిష్కరిస్తున్నామని... 'నీవేష్ మిత్ర' అనే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేశామని ఆయన చెప్పారు. గతంలో కూడా సింగిల్ విండో వ్యవస్థ గురించి చెప్పేవారు... కానీ తాము దానిని చాలా సీరియస్‌గా తీసుకుని అమలు చేశామన్నారు. దీంతో నేడు ఏ పెట్టుబడిదారుడు కూడా ప్రోత్సాహకాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని, అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సెమీకండక్టర్ విధానం 2024ని అమలు చేశామని, దీని ద్వారా పెట్టుబడిదారులకు మార్గాన్ని సుగమం చేస్తున్నామని సీఎం యోగి తెలిపారు.