దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టించింది. చైనాలో మరణమృదంగం మోగిస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధి.. ఇతర దేశాలకూ విస్తరిస్తుండటం మదుపరులను భయాందోళనలకు గురిచేసింది. కుప్పకూలిన ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రభావంతో భారతీయ సూచీలూ భీకర నష్టాలకు లోనయ్యాయి. 

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో కూరుకుపోవడంతో మదుపరుల సంపద ఈ ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది. సెన్సెక్స్‌ 807 పాయింట్లు పడిపోవడంతో బీఎస్‌ఈలోని ఆయా సంస్థల మార్కెట్‌ విలువ లక్షల కోట్ల రూపాయల్లో హరించుకుపోయింది. 

మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవడంతో దాదాపు షేర్లన్నీ నష్టాలకే పరిమితమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఒకవేళ ఆశించిన స్థాయిలో ఒప్పందాలు లేనిపక్షంలో మార్కెట్లు మంగళ, బుధవారాల్లో కూడా పడిపోక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలే కరోనా వైరస్‌ ధాటికి కుప్పకూలుతున్న మార్కెట్లకు ట్రంప్‌ మందుగా మారుతారా?.. లేక మంట పెడుతారా? వేచిచూడాల్సిందేనంటున్నారు.

సోమవారం బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 806.89 పాయింట్లు లేదా 1.96 శాతం పతనమై 40,363.23 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ ఒక్కరోజే ఈ స్థాయిలో నష్టపోవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఈ నెల ఒకటో తేదీన 987 పాయింట్లకుపైగా క్షీణించిన విషయం తెలిసిందే.

ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ సైతం 251.45 పాయింట్లు లేదా 2.08 శాతం పడిపోయి 12 వేల స్థాయికి దిగువన 11,829.40 వద్ద నిలిచింది. ఉదయం ప్రారంభం నుంచీ భారీ నష్టాల్లోనే కదలాడుతున్న స్టాక్‌ మార్కెట్లు.. ఏ దశలోనూ కోలుకున్న సంకేతాలనివ్వలేదు. 

దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌ దేశాల్లో కరోనా కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయన్న వార్తలతో మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. ఫలితంగా ఒకానొక దశలో సెన్సెక్స్‌ 40,306. 36 పాయింట్ల కనిష్ఠానికి దిగజారింది.

కరోనా వైరస్‌ భయాలతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. ముఖ్యంగా మెటల్‌, ఆటో, టెలికం రంగాల షేర్లు తీవ్ర నష్టాలకు గురయ్యాయి. టాటా స్టీల్‌ షేర్‌ విలువ అత్యధికంగా 6.39 శాతం దిగజారగా, ఓఎన్జీసీ, మారుతి సుజుకీ, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లూ పడిపోయాయి. 

మెటల్‌ సూచీ దాదాపు 6 శాతం, ఆటో 3.39 శాతం, టెలికం 3.33 శాతం మేర క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌-క్యాప్‌, స్మాల్‌-క్యాప్‌ సూచీలు 1.60 శాతం వరకు నష్టపోయాయి. ‘చైనాయేతర దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాపిస్తుండటంతో ఊహించిన దానికంటే వ్యాపార నష్టం ఎక్కువగా ఉండొచ్చన్న భయాలు.. మదుపరులను బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపునకు తీసుకెళ్లాయి. 

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ట్రంప్‌ పర్యటనలో ఇంకా ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాకపోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. లండన్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1,689.31 డాలర్లు పలికింది. జనవరి 2013 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

కరోనా దెబ్బకు ప్రపంచ మార్కెట్‌ విలవిలలాడిపోయింది. ఓవైపు చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వైరస్‌.. మరోవైపు దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లనూ పట్టుకుని పీడిస్తుండటం గ్లోబల్‌ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టింది. దక్షిణ కొరియాలో సోమవారం 161 కేసులు నమోదవగా, మొత్తం బాధితుల సంఖ్య 763ను తాకింది. చైనా తర్వాత అత్యధికంగా కరోనా కేసులున్నది దక్షిణ కొరియాలోనే కావడం గమనార్హం. 

కరోనా మృతులు 2,592కు చేరినట్లు తాజాగా ప్రకటించిన చైనా.. బాధితులు 77వేలపైనేనని చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా మదుపరులు తమ పెట్టుబడుల ఉపసంహరణలకే ప్రాధాన్యతనిచ్చారు. దీంతో ఆసియా, ఐరోపాల్లోని ప్రధాన మార్కెట్లన్నీ నష్టాలకే పరిమితం అయ్యాయి. 

ఇటలీ 5 శాతం, దక్షిణ కొరియా సూచీ 3.9 శాతం, ఫ్రాన్స్‌ 3.8 శాతం, జర్మనీ 3.7 శాతం, బ్రిటన్‌ 3.5 శాతం, స్పెయిన్‌ 3.3 శాతం, హాంకాంగ్‌ 1.8 శాతం, చైనా 0.3 శాతం మేర నష్టాలను పొందాయి. పర్యాటకుల రాకపోకలు భారీగా తగ్గిపోవడంతో ఆయా దేశాలకు టూరిజం ఆదాయం దూరమైందని, ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నదని మార్కెట్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే విమానయాన మార్కెట్‌ రూ.2 లక్షల కోట్ల మేర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ సెగ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలకూ తగులుతున్నది. 

ప్రపంచ ఇంధన వినియోగంపై వైరస్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటంతో క్రూడాయిల్‌కున్న డిమాండ్‌ తగ్గిపోతున్నది. ఫలితంగా ధరలు దిగివస్తున్నాయి. సోమవారం 4 శాతానికిపైగా ముడి చమురు ధర పడిపోయింది. ఇప్పటికే బ్యారెల్‌ ముడి చమురు ధర 50 డాలర్ల వద్దకు చేరుకోగా.. మున్ముందు 40ల్లోకి రావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 

ఇంధన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న చైనాలో కరోనా వైరస్‌ సృష్టిస్తున్న మారణహోమం.. ఆ దేశ ఉత్పత్తిని, తద్వారా చమురు వినియోగాన్ని తీవ్రంగా గాయపరిచింది. దీంతో చమురు విక్రయాలు పడిపోయి.. ధరలు దిగివస్తున్నాయి.

మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 3 నెలలకుపైగా కనిష్ఠానికి పడిపోయింది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య 34 పైసలు కోల్పోయి 71.98 వద్దకు చేరింది. ఉదయం ఆరంభంలోనే 71.94 వద్ద మొదలై మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలనిచ్చిన రూపాయి.. ఒకసారి 71.76 స్థాయికి బలపడింది. 
అయితే మరోసారి 72.01 స్థాయికి బలహీనపడి, చివరకు 71.98 వద్ద నిలిచింది. దేశీయ స్టాక్‌ మార్కెట్ల భారీ నష్టాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్‌కు పెరిగిన డిమాండ్‌.. రూపాయిని మరింత దిగజార్చాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం కూడా నష్టాలకు కారణమేనని ఫారెక్స్‌ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు.