ముంబై: దేశీయ బ్యాంకుల్లో పరిపాలన యంత్రాంగం అస్థవ్యస్తంగా ఉందనడానికి ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌ పతనమే ఉదాహరణ అని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్ట్ అండ్‌ పూర్స్ (ఎస్‌ అండ్‌ పీ‌) పేర్కొన్నది. ‘ఐసీఐసీఐ మాజీ ఎండీ కం సీఈఓ చందాకొచ్చర్‌ విషయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు, ఆమెపై బ్యాంకు బోర్డులో మారిన అభిప్రాయాలు, దేశీయ బ్యాంకుల్లో బలహీన యంత్రాంగం, పారదర్శకత కొరవడిందనడానికి ఉదాహరణలు’అని ఎస్ అండ్ పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలోనే ఒక బ్యాంకులో సీఈఓ హోదాను పొందిన మొదటి మహిళగా చందా కొచ్చర్ పేరు ప్రఖ్యాతలు పొందారు. నిబంధనలు ఉల్లఘించారంటూ ఆమె మీద ఆరోపణలు వచ్చినా 2016, 2018లో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు చందాకొచ్చర్ వెన్నంటే ఉంది. ఇప్పుడు బోర్డు నుంచి వచ్చిన వ్యతిరేకత కార్పొరేట్ రంగంలో ఉన్న బోర్డులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వెల్లడిచేస్తున్నాయని ఎస్ అండ్ పీ పేర్కొంది. 

ఆమెకు అందించిన బోనస్‌ మొత్తాలను వెనక్కి తీసుకోవాలన్న బోర్డు నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని ఎస్ అండ్ పీ తెలిపింది. ‘కారణం రీత్యా తొలగింపు’గా కొచ్చర్‌ రాజీనామాను పరిగణిస్తున్నామని బుధవారం ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన అంతర్గత దర్యాప్తు కమిటీ తమ నివేదికలో కొచ్చర్ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారని వెల్లడించిన అనంతరం బ్యాంకు ఆ ప్రకటన చేసింది. అది తనను తీవ్రంగా నిరాశపరిచిందని, షాక్‌కు గురిచేసిందని చందా కొచ్చర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇప్పటికే చందా కొచ్చర్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసే విషయంలో కొచ్చర్‌ అశ్రిత పక్షపాతానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.