ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం విదేశాల నుంచి 270 కోట్ల డాలర్ల (సుమారు రూ.18,630 కోట్లు) రుణాలు సేకరించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భావిస్తోంది. ప్రస్తుతం అధిక వడ్డీతో ఉన్న విదేశీ రుణాలు తిరిగి చెల్లించేందుకు ఈ రుణాలు సేకరించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ సంవత్సరం మార్చి నాటికి రూ.2,18,763 కోట్లు ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రుణ భారం గత నెలాఖరు నాటికి రూ.2,42,116 కోట్లకు పెరిగింది. టెలికం రంగంలోకి ప్రవేశించిన దగ్గరి నుంచి రిలయన్స్‌ రుణ భారం పెరుగుతోంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ నుంచి కృష్ణా-గోదావరి బేసిన్‌లో కేజీ-డీ6లో చమురు ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు రిలయన్స్‌ తెలిపింది.

ఉత్పత్తి తగ్గినందు వల్లే నిలిపివేత


క్రుష్ణా - గోదావరి బేసిన్ పరిధిలోని ‘ఎంఏ క్షేత్రంలో సెప్టెంబర్‌ నుంచి ఉత్పత్తిని నిలిపివేయవచ్చు’’ అని అని రిలయన్స్ పేర్కొన్నది. ఈ చమురు, సహజవాయు క్షేత్రంలో రోజుకు 39,976టన్నుల ఉత్పత్తి జరిగింది. మే 2010లో అత్యధికంగా రోజుకు 1,08,418 టన్నుల ఉత్పత్తి జరిగ్గా ప్రస్తుతం అది 1960 టన్నులకు పడిపోయింది. మరోపక్క కేజీ-డీ6లో కూడా గ్యాస్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో కేజీ-డీ6, డీ1,డీ3ల్లో కలిపి రోజుకు 4.7ఎంఎంఎస్‌సీఎండీ మాత్రమే ఉత్పత్తి అయింది. ఇప్పటికే చమురు ఉత్పత్తి ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపట్టేందుకు రిలయన్స్‌ బ్యాంకు‌ గ్యారెంటీలు కూడా ప్రభుత్వానికి సమర్పించింది. దీంతోపాటు కేజీ-డీ6లో కొత్త చమురు క్షేత్రాలను అభివృద్ధి చేసేందుకు రిలయన్స్‌ మూడు కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఆర్‌.క్లస్టర్‌, శాటిలైట్‌ క్లస్టర్‌, ఎంజే ఫీల్డ్స్‌ను దాదాపు రూ.40,000 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయనుంది.

కేజీ బేసిన్‌లో రిలయన్స్‌కు 60% వాటా


కేజీ-డి6 బ్లాక్‌లో రిలయన్స్‌కు 60శాతం వాటా ఉంది. ఇక యూకేకు చెందిన బీపీ పీఎల్‌సీకు 30శాతం, కెనడాకు చెందిన నికో రిసోర్స్‌ లిమిటెడ్‌కు 10 శాతం వాటా ఉంది. దాదాపు పదేళ్ల క్రితం ఇక్కడ రిలయన్స్‌ చమురు సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభించింది. కానీ, అనుకన్న దానికంటే వేగంగా ఇక్కడ ఉత్పత్తి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకూ కృష్ణా గోదావరి బేసిన్‌లో రిలయన్స్‌ 19 చమురు, సహజ వాయు నిక్షేపాలను కనుగొంది. వీటిల్లో డీ26 బావిలో 2008లో చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. ఇక డీ1, డీ3 బ్లాకుల్లో 2009 నుంచి ఉత్పత్తి మొదలు పెట్టింది.

వచ్చేనెలలో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలు?!


ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు సేవలకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అనుమతి ఇవ్వడంతో ఆగస్టులో సేవలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 650 శాఖలు, 17 కోట్ల ఖాతాలతో భారీ స్థాయిలో సేవలు ఆరంభించనున్నది. ప్రస్తుతం తాము ప్రారంభ తేదీ నిర్ణయించే పనిలో ఉన్నామని, నిర్వహణ, సాంకేతికత, మార్కెట్‌ దృష్ట్యా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు (ఐపీపీబీ) ఎండీ, సీఈవో సురేశ్‌ సేథి తెలిపారు.

అన్నీ పరీక్షించాకే ఆర్బీఐ అనుమతులు ఇలా


ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు పూర్తి వ్యవస్థను పరీక్షించిన తర్వాతే ఆర్బీఐ అనుమతి ఇచ్చిందని సురేశ్‌ స్పష్టం చేశారు. ఆర్బీఐ నుంచి ఇక తుది అనుమతి రాగానే సేవలు ప్రారంభిస్తామన్నారు. జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక బృందం చేత పరీక్షలు నిర్వహించామని, వ్యవస్థ అద్భుతంగా నడుస్తోందని ఆయన అన్నారు. 250 శాఖలతో ఈ పని నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 650 శాఖలు, పోస్టాఫీసుల్లో 3,250 యాక్సెస్‌ పాయింట్లు, 11,000 డాక్‌ సేవక్‌, పోస్టమెన్‌లతో ఐపీపీబీ ఇంటి వద్దకే బ్యాంకు సేవలు ప్రారంభించనుంది. 1,700 కౌంటర్లతో పాటు 11,000 ఇంటివద్దకే బ్యాంకు సేవలు అందించనుంది. పూర్తి స్థాయిలో కుదురుకున్న తర్వాత 1.55 లక్షల పోస్టాఫీసుల్లోనూ బ్యాంకు సేవలు ప్రారంభమవుతాయి.