న్యూఢిల్లీ: చైనా వస్తువులను బహిష్కరించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ప్రచారోద్యమాన్ని చేపట్టింది. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి దాదాపు రూ.లక్ష కోట్ల (1,300 కోట్ల డాలర్ల) విలువైన చైనా వస్తు దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో బుధవారం ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది.

ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్న ఉత్పత్తుల స్థానంలో సులభంగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు దేశీయంగా తయారవుతున్న 3,000 వస్తువులతో ఓ జాబితాను రూపొందించింది. 

దేశవ్యాప్తంగా దాదాపు 7 కోట్ల మంది వర్తకులకు, 40 వేల వ్యాపార సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఏఐటీ.. ప్రస్తుతం సరిహద్దులో భారత్‌-చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రచారోద్యమానికి శ్రీకారం చుట్టింది.

also read కోట్ల కొలువులు గోవిందా.. పేదల బతుకు ఆగమాగం.. ఓఈసీడీ హెచ్చరిక

‘ఇండియన్‌ గూడ్స్‌-అవర్‌ ప్రైడ్‌' (భారతీయ వస్తువులే మనకు గర్వకారణం) అనే నినాదంతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ప్రస్తుతం చైనా నుంచి భారత్‌కు వస్తువులు, ముడిపదార్ధాలు, విడిభాగాలు, టెక్నాలజీ ఉత్పత్తుల్లాంటి నాలుగు రకాల దిగుమతులు జరుగుతున్నాయని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ మీడియాకు తెలిపారు.

తమ ప్రచారోద్యమంలో భాగంగా తొలివిడుతలో చైనా వస్తు దిగుమతులను బహిష్కరించాలని నిర్ణయించినట్టు సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ చెప్పారు. ప్రస్తుతం చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వస్తువుల విలువ దాదాపు 70 బిలియన్‌ డాలర్ల (రూ.5,29,130 కోట్ల) వరకు ఉన్నది. 

‘2001లో మనం చైనా నుంచి చేసుకొన్న దిగుమతుల విలువ కేవలం 2 బిలియన్‌ డాలర్లే (రూ.15,122 కోట్లే). కానీ ఈ 20 ఏళ్లలో అవి గణనీయంగా 3,500 శాతం పెరిగి 70 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీన్నిబట్టి చూస్తే భారత రిటైల్‌ మార్కెట్‌ను హస్తగతం చేసుకోవాలని చైనా దుర్బుద్ధితో ఉన్నట్టు స్పష్టమవుతున్నది’ అని ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ అన్నారు.