Asianet News TeluguAsianet News Telugu

డిస్కౌంట్లతోనే ఇళ్ల ప్లాట్ల అమ్మకాల జోరు.. తేల్చేసిన అనరాక్

 కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన  లాక్‌‌డౌన్‌‌ వల్ల రియల్‌‌ ఎస్టేట్‌‌ కుదేలయిందని, ఈ పరిస్థితుల్లో ‘రెడీ టూ మూవ్‌‌’ ఇండ్లను అమ్ముకోవాలంటే బిల్డర్లు డిస్కౌంట్లు ఇవ్వడం తప్ప వేరే మార్గమేదీ లేదని ప్రాపర్టీ బ్రోకరేజ్‌‌ కంపెనీ అనరాక్‌‌ స్పష్టం చేసింది. 

Builders should offer discounts to sell units worth Rs 66,000 crore amid COVID-19 outbreak : Anarock
Author
New Delhi, First Published Apr 26, 2020, 12:13 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన  లాక్‌‌డౌన్‌‌ వల్ల రియల్‌‌ ఎస్టేట్‌‌ కుదేలయిందని, ఈ పరిస్థితుల్లో ‘రెడీ టూ మూవ్‌‌’ ఇండ్లను అమ్ముకోవాలంటే బిల్డర్లు డిస్కౌంట్లు ఇవ్వడం తప్ప వేరే మార్గమేదీ లేదని ప్రాపర్టీ బ్రోకరేజ్‌‌ కంపెనీ అనరాక్‌‌ స్పష్టం చేసింది. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోని రియాల్టీ ప్రాజెక్టుల్లో రూ.66 వేల కోట్ల విలువైన ఇళ్లు గృహప్రవేశానికి సర్వసిద్ధంగా ఉన్నాయని అనరాక్‌ తెలిపింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఈ నిల్వలను క్లియర్‌ చేసుకునేందుకు బిల్డర్లు.. డిస్కౌంట్లు ఆఫర్‌ చేయాలని సూచించింది.

ఈ ప్రాపర్టీ బ్రోకరేజ్‌ సంస్థ గణాంకాల ప్రకారం.. మార్చి త్రైమాసికం చివరినాటికి హైదరాబాద్‌, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె నగరాల్లో మొత్తం 78 వేల ఫ్లాటు అమ్ముడుపోకుండా ఉన్నాయి.

మొత్తం 6.44 లక్షల యూనిట్ల నిల్వల్లో రెడీ టు మూవ్‌ ఇన్‌ ఫ్లాట్ల వాటా 12 శాతం. మిగతా 88 శాతం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ పరిధిలో అత్యధికంగా రూ.26,150 కోట్ల విలువైన 19,200 రెడీ టు మూవ్‌ఇన్‌ ఫ్లాట్లు అమ్ముడుకావాల్సి ఉంది.

అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లో ఈ నిల్వలు తక్కువని అనరాక్‌ వెల్లడించింది. హైదరాబాద్ నగర పరిధిలో రూ.1,870 కోట్ల విలువైన 2,400 యూనిట్లు అమ్ముడు కావాల్సి ఉంది. అయితే, డెవలపర్ల దగ్గర లిక్విడిటీ లేదు కాబట్టి డిస్కౌంట్లతో అమ్మకాలు పెంచుకోవాలని అనరాక్ సూచించింది. 

హోల్డింగ్‌‌ కెపాసిటీ ఉన్న వాళ్లు ఆగొచ్చని అనరాక్‌‌ చైర్మన్‌‌ అనుజ్‌‌ పురి చెప్పారు. ‘‘బలమైన బ్యాలన్స్​షీట్​, హోల్డింగ్‌‌ కెపాసిటీ ఉన్న వాళ్లు డిస్కౌంట్లు ఇచ్చే అవకాశాలు తక్కువ. అర్జంటుగా డబ్బు కావాలనుకునేవాళ్లు మాత్రం తక్కువ ధరలకే అమ్మవచ్చు’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి అన్నారు.

‘దేశవ్యాప్తంగా  మొత్తం 6.44 లక్షల యూనిట్లలో అమ్ముడుపోని ఇన్వెంటరీ వాటా 12 శాతం. మిగతా 88 శాతం ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. తొలిసారిగా ఇల్లు కొనాలనుకునేవారు  డెవలపర్లతో బేరమాడితే తక్కువ రేటుకే ఇంటిని దక్కించుకోవచ్చు. హోమ్‌‌లోన్లపై వడ్డీలు కూడా 7.8 శాతం లోపే ఉన్నాయి’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి వివరించారు. 

ఇదిలా ఉంటే లాక్‌‌డౌన్‌‌ వల్ల నిలిచిపోయిన ఇండ్ల రిజిస్ట్రేషన్‌‌ను ఆన్‌‌లైన్‌‌లో చేయాలని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌‌ సహా చాలా నగరాల్లో ఇండ్లకు డిమాండ్‌‌ తగ్గుతున్నదని పేర్కొనగా, హైదరాబాద్‌‌లో ఫ్లాట్ల విలువ పెరిగిందని ఆన్‌‌లైన్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌‌టైగర్ డాట్ కాట్‌‌ నివేదిక వ్యాఖ్యానించింది.  

భారతదేశపు ఫార్మా రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌‌లో ఆస్తుల విలువ గతేడాది జనవరి త్రైమాసికంతో పోలిస్తే ఈసారి జనవరి త్రైమాసికం‌లో తొమ్మిది శాతం పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరపు నాలుగో క్వార్టర్‌‌లో ఫ్లాట్ల చదరపు అడుగుకు సగటు ధర రూ. 4,977 కాగా, 2019- 2020 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం‌లో ఇది రూ.5,434లకు చేరింది.

దీంతో హైదరాబాద్‌‌ రేట్లు బెంగళూరు, చెన్నైని మించిపోతున్నాయి. అయితే వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇళ్ల అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. గత నెల 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కేవలం 5,554 యూనిట్లు  అమ్ముడయ్యాయి. 

also read:నేడే అక్షయ తృతీయ: కరోనాతో ఆన్‌లైన్ సేల్స్‌కే ‘గోల్డ్’ పరిమితం

వీటిలో కేవలం 14 శాతం యూనిట్లు మాత్రం అందుబాటులో ధరల కేటగిరీలో వస్తాయి. అంటే వీటి ధరలు రూ. 45 లక్షల లోపు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు గత సంవత్సరంతో పోలిస్తే 56 శాతం తగ్గాయి. మార్చి క్వార్టర్‌‌లో 3,904 యూనిట్లు మాత్రమే మొదలయ్యాయని అనరాక్‌‌ నివేదిక తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios