Builder ai: బిల్డర్.ఏఐ చేసిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఏఐ మోసాలు సహా తీవ్ర ఆరోపణల మధ్య దివాళా ప్రకటన చేసింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Builder ai: 2016లో లండన్‌కు కేంద్రంగా సచిన్ దేవ్ దుగ్గల్ స్థాపించిన స్టార్టప్ కంపెనీ బిల్డర్.ఏఐ (ఇంజనీరింగ్.ఏఐ) ఇప్పుడు భారీ మోసం ఆరోపణల మధ్య దివాళా తీసినట్టు ప్రకటన చేసింది. ఒకప్పుడు $1.5 బిలియన్ విలువ కలిగిన ఈ కంపెనీ, కృత్రిమ మేథస్సు ఆధారిత నో-కోడ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రసిద్ధి పొందింది. 

అప్పట్లో ఏఐ వర్క్ తో సంచలనం రేపింది. దీంతో ఈ స్టార్టప్ లో మైక్రోసాఫ్ట్, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సాఫ్ట్‌బ్యాంక్ డీప్‌కోర్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC) వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ స్టార్టప్ కంపెనీ “యాప్ అభివృద్ధిని పిజ్జా ఆర్డర్ చేసేంత సులభంగా” చేస్తామని వాదనలతో మార్కెట్ లో బలమైన ముద్ర వేసింది.

బిల్డర్.ఏఐ ఎలా ఫ్రాడ్ చేసింది? 

కంపెనీ స్వతంత్ర ఏఐ అసిస్టెంట్ 'నటాషా' ఆధారంగా పూర్తిగా స్వయంచాలితంగా సాఫ్ట్‌వేర్ తయారీ జరుగుతుందని ప్రచారం చేసింది. కానీ నిజానికి బిల్డర్.ఏఐ ఈ పనిని ఏఐతో కాకుండా మనుషులతో చేయించింది. బిల్డర్.ఏఐ ప్రాజెక్టులు భారతదేశంలో ఉన్న సుమారు 700 మంది ఇంజినీర్ల కోడ్ తో తయారయ్యాయి. దీనిని ఏఐ చేసినట్టుగా చిత్రీకరించి పెట్టుబడిదారుల్ని ఆకర్షించింది.

2019 నుంచే ఈ స్టార్టప్ పై అనుమానాలు మొదలయ్యాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికలో ఏఐ వాదనల్లో మోసం ఉన్నట్లు నివేదించింది. మాజీ ఉద్యోగి రాబర్ట్ హోల్డహైమ్ కంపెనీపై $5 మిలియన్ నష్టపరిహారం కోర్టులో కోరగా, కంపెనీ అక్రమ కార్యకలాపాలను బయటపెట్టినట్లు వాస్తవాలు వెలుగుచూశాయి.

2025 ప్రారంభంలో సీఈఓగా మన్‌ప్రీత్ రతియా బాధ్యతలు స్వీకరించిన తరువాత, కంపెనీ 2024 ఆదాయాన్ని మార్పులు చేసి తప్పుడు లెక్కలతో $220 మిలియన్లుగా చూపించింది. వాస్తవానికి బిల్డర్.ఏఐ ఆదాయం కేవలం $50 మిలియన్లని బయటపడింది. స్వతంత్ర ఆడిట్‌ తర్వాత రుణదాత వియోలా క్రెడిట్ బిల్డర్.ఏఐ ఖాతాల్లోని $37 మిలియన్లను స్వాధీనం చేసుకుందని సమాచారం. దీంతో కంపెనీ వద్ద మిగిలినదంతా కేవలం $5 మిలియన్లు మాత్రమే.

1000 మంది బిల్డర్.ఏఐ ఉద్యోగల తొలగింపు

ఫండింగ్ నిలిచిపోవడంతో బిల్డర్.ఏఐ 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. పైగా, బెంగళూరులో ఉన్న ఇండియన్ సోషల్ మీడియా సంస్థ VerSeతో కలసి లావాదేవీలను “రౌండ్ ట్రిప్” చేసి, అమ్మకాల నెంబర్లను తప్పుడు రీతిలో పెంచినట్టు ఆరోపణలు వచ్చాయి.

బిల్డర్.ఏఐ పై ప్రస్తుతం అమెరికా ఫెడరల్ విచారణ కొనసాగుతోంది. కంపెనీ అమెజాన్‌కు $85 మిలియన్లు, మైక్రోసాఫ్ట్‌కు $30 మిలియన్ల క్లౌడ్ సేవల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

లింక్డ్‌ఇన్‌లో బిల్డర్.ఏఐ అధికారికంగా దివాళా ప్రకటన చేస్తూ.. “మా ప్రస్తుత బృందం ఎంతగా శ్రమించినా, గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఎదురైన ఆర్థిక ఒత్తిడిని అధిగమించలేకపోయాం” అని వెల్లడించింది. ఇండియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో కంపెనీ దివాళా ప్రక్రియలు ప్రారంభించిందని సమాచారం.