Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ఎన్ఎల్ లక్ష్యం: మార్చికల్లా 10వేల శాటిలైట్ ఫోన్ల విక్రయం

శాటిలైట్ ఫోన్ల విక్రయంలో తనదైన ముద్ర వేసిన బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది మార్చి నాటికి 10 వేల ఫోన్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. గతేడాది మే నుంచి 4000 శాటిలైట్ ఫోన్ల విక్రయంతో రూ.100 కోట్ల ఆదాయం సంపాదించినట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. 

BSNL aims to sell 10,000 satellite phones by March 2019

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికి 10 వేల శాటిలైట్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ ‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకు, నిపుణులకు గతేడాది 4 వేల శాటిలైట్‌ ఫోన్లను విక్రయించినట్లు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్‌ అనుపమ్‌ శ్రీవాత్సవ తెలిపారు. గతేడాది మే నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ హైప్రొఫైల్‌ శాటిలైట్‌ ఫోన్ల విక్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

బేష్షుగ్గా శాటిలైట్ ఫోన్ల వ్యాపారం


‘శాటిలైట్‌ ఫోన్ల వ్యాపారం బాగా జరుగుతోంది. రక్షణ, సైనిక, సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌), విపత్తు నిర్వహణ సంస్థలు, ఓఎన్‌జీసీ, రైల్వేలు, కొన్ని ప్రైవేటు రంగాలకు చెందిన కంపెనీలకు సుమారు 4వేల శాటిలైట్‌ ఫోన్లను విక్రయించాం’ అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ శ్రీవాత్సవ అన్నారు.

భిన్నంగా పని చేసే శాటిలైట్ ఫోన్లు


సాధారణ మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే, శాటిలైట్‌ ఫోన్లు భిన్నమైనవి. వీటికి సిగ్నల్స్‌ నేరుగా శాటిలైట్‌ అందుతాయి. ప్రతికూల వాతావరణంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి. మొబైల్‌ టవర్ల సిగ్నల్‌తో సంబంధం లేకుండా ఇవి ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవతలి వారితో అనుసంధానమయ్యేలా ఉపయోగపడతాయి.

ఎక్కడనుంచైనా శాటిలైట్ ఫోన్లతో మాట్లాడొచ్చు


దేశంలోని ఏ ప్రదేశం నుంచైనా వీటి ద్వారా మాట్లాడవచ్చు. విమానాల్లోనూ, నౌకలలోనూ ఇవి పనిచేస్తాయి. సాధారణ మొబైల్స్‌ కేవలం 25-30 కి.మీ. దూరంలో ఉన్న టవర్స్‌ నుంచి సిగ్నల్స్‌ తీసుకునే సామర్థ్యం ఉండగా, శాటిలైట్‌ ఫోన్లు, భూమికి 35,700 కి.మీ. దూరంలో ఉన్న శాటిలైట్‌ నుంచి అందుకుంటాయి. అంతేకాదు, శాటిలైట్‌ ఫోన్ల ధర కూడా చాలా ఎక్కువ. ఇక నిమిషానికి రూ.25 నుంచి రూ.30 వరకూ కాల్‌ ఛార్జ్‌ పడుతుంది. 

గతేడాది మే నుంచి రూ.100 కోట్ల ఆదాయం


గతేడాది మేలో ఈ ఫోన్లను విడుదల చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇప్పటి వరకూ రూ.100 కోట్ల ఆదాయం ఆర్జించించిందని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ శ్రీవాత్సవ తెలిపారు. 2018-19లో వీటి విక్రయాలను 10వేలకు చేర్చాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. నావికాదళానికి, చేపల వేటకు వెళ్లేవారికి, మత్స్య పరిశ్రమకు చెందిన వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఈ ఫోన్లపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు.

ఎయిర్‌టెల్‌, జియో సీటీవోల రాజీనామా


ప్రముఖ టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ల ఛీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్లు (సీటీవో)తమ తమ పదవులకు రాజీనామా చేశారు. రిలయన్స్‌ జియో గ్రూప్‌ సీటీవోగా పనిచేస్తున్న జగ్బీర్‌ సింగ్‌ ఆదివారం రాజీనామా చేశారు. 4జీ సేవల ప్రారంభానికి ముందు నుంచే ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంతకు ముందు ఈయన ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో సుమారు దశాబ్దకాలం పాటు పనిచేశారు. రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు.

మర్దికర్ రాజీనామాను ధ్రువీకరించిన ఎయిర్‌టెల్


భారతీ ఎయిర్‌టెల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌కు సీటీవోగా పనిచేస్తున్న శ్యామ్‌ ప్రభాకర్‌ మర్దికర్‌ కూడా తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు ధ్రువీకరించారు. మర్దికర్‌ ఇక్కడ రాజీనామా చేసి సొంతంగా వ్యాపారం మొదలు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన 2001లో ఈ కంపెనీలో చేరారు. దశాబ్దకాలంపాటు ఇక్కడే పనిచేసిన ఈయన కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు. రెండేళ్ల విరామం తర్వాత తిరిగి 2012లో ఎయిర్‌టెల్‌లో చేరారు. 2017నుంచి ఈయన ఛీప్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios