వాషింగ్టన్: కరోనా విశ్వమారి కారణంగా ప్రయాణ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా 12,000 మందికి పైగా ఉద్యోగులను బోయింగ్‌ తొలగిస్తోంది. ఈ వారంలో ఇప్పటికే అమెరికాలో 6,770 మంది ఉద్యోగుల్ని తప్పించింది. మరో 5,520 మంది సిబ్బందిని స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తు చేసుకోవాలని కోరనుంది.

అమెరికాలో ఏప్రిల్‌ మధ్యలో విమాన ప్రయాణాలు 96 శాతం మేర తగ్గాయి. ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా మారాయి. మంగళవారం అమెరికా విమానాశ్రయాల్లో 2,64,843 మంది అడుగుపెట్టారని.. గతేడాదితో పోలిస్తే ఇది 89 శాతం తక్కువ అని ఒక నివేదిక పేర్కొంది. తమ సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు బోయింగ్‌ గతంలోనే స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుకు తగినట్లు చర్యలు తీసుకుంటోంది.

also read వచ్చే ఏడాది ఆర్థిక రంగానికి పునరుజ్జీవం.. జీడీపీపై ఆర్‌బి‌ఐ మాజీ గవర్నర్

బోయింగ్స్ సంస్థలో 1.60 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ వచ్చే కొన్ని నెలల్లో అదనపు సిబ్బందిని తొలగించక తప్పదని చెప్పారు. సియాటెల్ ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉద్యోగుల తొలగింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం ప్రయాణికుల విమానాలకు డిమాండ్ తగ్గడం కూడా బోయింగ్ తన ఉద్యోగులను తొలగించడానికి ముఖ్య కారణం. 737 మాక్స్ విమానాలు రెండు కూలిపోయినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా విమాన నియంత్రణ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం వరకు విమానయాన సర్వీసులు నడవడం లేదు. ఫలితంగా కొత్త విమానాల డెలివరీ ఆర్డర్లు బోయింగ్ సంస్థకు రావడం లేదు.