Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఏడాది ఆర్థిక రంగానికి పునరుజ్జీవం.. జీడీపీపై ఆర్‌బి‌ఐ మాజీ గవర్నర్

కరోనా కల్పించిన కల్లోలం వల్ల నష్టం వాటిల్లినా వచ్చే ఏడాది మెరుగుదల నమోదవుతుందని ఆర్‌బి‌ఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ఐదు శాతం జీడీపీ నమోదు అవుతుందన్నారు. అయితే అది అభివ్రుద్ది సాధించినట్లు కాదని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా వ్యాఖ్యానించడం కొసమెరుపు 

rbi former governor says India's GDP growth may rebound in next year
Author
Hyderabad, First Published May 28, 2020, 11:44 AM IST

ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక రంగం పునరుజ్జీవం సాధిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నారు.

కరోనా వల్ల ప్రస్తుతం నెలకొన్న నిరాశాపూరిత వాతావరణంలో ఈ ఏడాది 5 శాతం ప్రతికూల వృద్ధి ఖాయమన్న అంచనాల నడుమ ఆయన మాట మండుటెండలో చిరుజల్లులా తాకింది. ఈ ఏడాది భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వాతంత్య్రం తర్వాత నాల్గవ తిరోగమనం చవి చూడబోతున్నదని, దేశచరిత్రలోనే ఇది భారీ తిరోగమనం కాగలదని క్రిసిల్‌ అంచనా వేసిన విషయం విదితమే. 

కరోనా ప్రకృతి వైపరీత్యం కాదని, మన ఫ్యాక్టరీలు, మౌలిక వసతులు, రవాణా వ్యవస్థ తాత్కాలికంగా మూత పడినా అవకాశం రాగానే తిరిగి జోరందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. వచ్చే ఏడాది పునరుజ్జీవం సాధ్యమనడానికి అదే కారణమని భవన్‌ ఎస్‌పీజీఐఎంఆర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ స్టడీస్‌ నిర్వహించిన వెబినార్‌లో దువ్వూరి సుబ్బారావు విశ్లేషించారు.

also read దేశవ్యాప్తంగా 60శాతం మహిళల వద్దనే బంగారు ఆభరణాలు.. తాజా సర్వే సంచలనం..

ప్రస్తుతం కరోనా కల్పించిన కల్లోలం మాత్రం తీవ్రమైన బాధను మిగుల్చుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. అనియత రంగంలోని పలు సంస్థలు  మూతపడవచ్చునని చెప్పారు. ఇంత నిరాశావహ స్థితిలో కూడా విదేశీ వాణిజ్యంలో సాపేక్ష స్థిరత్వం, అద్భుతమైన వ్యవసాయ దిగుబడులు సానుకూలమైన అంశాలని చెప్పారు.

అయితే, ఈ నెలలో ఇంతకుముందు జరిగిన మరో వెబినార్ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ వల్ల ఉపయోగమేమీ లేదని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కొనసాగించడం వల్ల ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తుందని కూడా చెప్పారు.


2021-22లో భారత ఆర్థిక వ్యవస్థ 5-6 శాతం వృద్ధి సాధించ వచ్చునని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా చెప్పారు. కాని దీన్ని రికవరీగా భావించడానికి లేదన్నారు. ఈ ఏడాది ఇప్పుడు 5 శాతం క్షీణత ఏర్పడినందు వల్ల ఆ తర్వాత ఆ స్థాయి నుంచి 6 శాతం పురోగమించినప్పటికీ వృద్ధిరేటు 2019-20 స్థాయిలోనే ఉంటుందన్న విషయం ఆయన గుర్తు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios