హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మ‌హిళ బిట్‌కాయిన్‌లో పెట్టుబడుల‌తో అత్య‌ధిక లాభాలొస్తాయ‌ని రూ. 1 కోటి వ‌ర‌కు నష్ట‌పోయింది. బిట్ కాయిన్, క్రిప్టో క‌రెన్సీల‌లో పెట్టుబ‌డుల ద్వారా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ లాభాలు వ‌స్తాయ‌ని ప‌లు విడ‌త‌లుగా మొత్తం రూ. 90 ల‌క్ష‌ల‌తో బిట్‌కాయిన్స్ కొనుగోలు చేసింది. 

బిట్‌కాయిన్‌లో పెట్టుబడులతో అత్యధిక లాభాలొస్తాయని స్నేహితుల ద్వారా విని ఆత్యాశకు పోయిన ఓ మహిళ కోటి రూపాయల వరకు నష్టపోయింది. సిటీ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేసే కొందరు మహిళలతో స్నేహం ఉంది. బిట్‌కాయిన్‌, తదితర క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని వారి మాటల ద్వారా తెలుసుకుంది. సొంతంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఓ యాప్‌ ద్వారా పలు విడతలుగా మొత్తం రూ.90 లక్షలతో బిట్‌కాయిన్స్‌ కొనుగోలు చేసింది. ఆ యాప్‌లో యూఎస్‌ డాలర్ల రూపంలో పెట్టుబడులకు అధిక మొత్తంలో లాభాలు వస్తున్నట్లు కనిపించింది. 

అయితే.. క్రిప్టో కరెన్సీ చేసే ట్రేడర్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఆ అకౌంట్‌లో ఉన్న రూ. 2 కోట్లలో సుమారు రూ. 90 లక్షలకు పైగా సొమ్మును వారి వారి ఖాతాల్లోకి మళ్లించారు. ఇది గమనించిన జూబ్లీహిల్స్‌కు చెందిన ఉషారాణి బుధవారం సిటీ సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఐటీ రంగానికి చెందిన ఉషారాణి కొన్నేళ్లుగా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన బినాన్స్‌లో ఈమెకు అకౌంట్‌ కూడా ఉంది. ఆ అకౌంట్‌లో రూ. కోట్లు విలువ గల కరెన్సీ ఉంది.

ఇటీవల ఉషారాణి అకౌంట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. యూఎస్‌డీ కింద ఉన్న కరెన్సీ (1.22 లక్షలు) ఇండియన్‌ కరెన్సీలో సుమారు రూ. 92 లక్షలను మన దేశ కరెన్సీ కింద కన్వెర్ట్‌ చేసి వివిధ అకౌంట్‌లకు బదిలీ చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన మహిళ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.