ముంబై: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నదని సమాచారం. టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ రూ.30వేల కోట్ల భారీ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. 

మరికొద్ది వారాల్లోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంపై ఇరువర్గాలు స్పందించేందుకు నిరాకరించాయి. ఫేస్‌బుక్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌ వంటి టెక్నాలజీ దిగ్గజాలతో పాటు పలు అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు, వెంచర్‌ ఫండ్స్‌ జియోలో వాటాలు కొనుగోలు చేశాయి. 

తాజాగా ఈ జాబితాలోకి సెర్చింజన్ గూగుల్‌ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది నెలల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌ మొత్తం 25.24 శాతం వాటా విక్రయం ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) రూ.1,18,318.45 కోట్లు సమీకరించింది. 

రిలయన్స్ డిజిటల్‌ సేవల అనుబంధ కంపెనీయే జియో ప్లాట్‌ఫామ్స్‌. ఇప్పటివరకు కుదుర్చుకున్న వాటా విక్రయ ఒప్పందాల్లో భాగంగా జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువను రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజ్‌ విలువను రూ.5.16 లక్షలుగా లెక్కగట్టారు. 

also read ఒక్కొక్కరిని దాటుకుంటూ... ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానానికి ముఖేశ్ ...

కాగా భారత మార్కెట్‌పై గూగుల్‌ ప్రత్యేక దృష్టిసారించింది. వచ్చే 5-7 ఏళ్లలో ఇండియాలో 1,000 కోట్ల డాలర్లు (రూ.75,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ వాటాల కొనుగోళ్లతో పాటు పలు మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు పిచాయ్‌ వెల్లడించారు.

ఇదిలా ఉంటే, అందరి ద్రుష్టి బుధవారం జరిగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటాదారుల 43వ వార్షిక సమావేశం (ఏజీఎం)పైనే ఉంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో రిలయన్స్‌ తొలిసారిగా వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించబోతోంది. రిలయన్స్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఏజీఎంలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని మార్గెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

కరోనా తర్వాత దశ వ్యాపార ప్రణాళికలను ముకేశ్ అంబానీ వెల్లడించవచ్చని, సౌదీ అరామ్ కోతో డీల్‌పై స్పష్టత రావచ్చని వారంటున్నారు. అంతేకాదు, ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోళ్లపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 


వాటాదారులకు బోనస్‌, ఫైబర్‌ ఆస్తుల మానిటైజేషన్‌పైనా ప్రకటనలుండవచ్చు. జియోతో జట్టుకట్టిన ఫేస్‌బుక్‌ తదితర టెక్నాలజీ దిగ్గజాలతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని, ఏజీఎంలో ఈ విషయంపైనా స్పష్టత రావచ్చని మార్కెట్‌ వర్గాలంటున్నాయి.