భారత టెలికం రంగాన్ని 2016 వరకు ఏలిన రారాజు ‘భారతీ ఎయిర్‌టెల్’ను కష్టాలు వీడలేదు. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో రోజురోజుకు కస్టమర్ల బేస్ కొడిగట్టిపోతోంది. ఒక్క 2018 డిసెంబర్ నెలలోనే భారతీ ఎయిర్ టెల్ కస్టమర్లు 5.7 కోట్ల మంది హరించుకుపోయారు. 

టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నివేదిక ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ కస్టమర్ల సంఖ్య 2018 నవంబర్ నాటికి 34.1 కోట్ల మందికి చేరింది. తర్వాత డిసెంబర్ నెలలోనే ఎయిర్ టెల్ కస్టమర్లు 5.7 కోట్ల మంది ఇతర ప్రొవైడర్లు.. అంటే రిలయన్స్ జియో తదితర సంస్థల వైపు మళ్లిపోయారు. 

ఇంకో గమ్మత్తు కూడా ఉంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ సంస్థల కస్టమర్ల మధ్య తేడా చాలా కొంచెమే సుమా. గతేడాది డిసెంబర్ నెలాఖరు నాటికి రిలయన్స్ జియో కస్టమర్ల పునాది 28 కోట్లకు చేరుకున్నది. 

ఇక భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72% తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ.86 కోట్లుగా నమోదైందని ఎయిర్‌టెల్‌ తెలిపింది. 

భారత్‌లో టెలికం వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండటమే ఈ భారీ క్షీణతకు కారణమని కంపెనీ ఇండియా అండ్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ  గోపాల్‌ విఠల్‌ తెలిపారు.  భారతీ ఎయిర్ టెల్ ఆదాయం రూ.20,319 కోట్ల నుంచి 1 శాతం పెరిగి రూ.20,519 కోట్లకు చేరిందని కంపెనీ ఇండియా అండ్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ  గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. 

గత ఏడాది మూడో త్రైమాసికంలో రూ.123గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ).. ఈ ఏడాది 16 శాతం తగ్గి రూ.104కు చేరిందని కంపెనీ ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. గత క్యూ3లో రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్న నికర రుణభారం ఈ క్యూ3లో రూ.6,837 కోట్లు క్షీణించి రూ.1.06 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వల్లే రూ.1,017 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని కంపెనీ ఇండియా అండ్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, భారత కార్యకలాపాల నికర నష్టాలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.972 కోట్లని పేర్కొన్నారు.

అన్ని టెలికం వ్యాపారాల్లో ఒక్క ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా టెలికం వ్యాపారంలో మాత్రమే నికర లాభం వృద్ధి చెందిందని కంపెనీ ఇండియా అండ్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌  తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.394 కోట్లుగా ఉన్న ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా నికరలాభం ఈ మూడో త్రైమాసికంలో 40 శాతం ఎగసి రూ.552 కోట్లకు పెరిగిందని ఇండియా అండ్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ వివరించారు.

ఈ విభాగం మొత్తం ఆదాయం రూ.5,284 కోట్ల నుంచి 11% పెరిగి రూ.5,904 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. డేటా వృద్ధి జోరుగా ఉండటం, ఎయిర్‌టెల్‌మనీ లావాదేవీల విలువ పెరగడం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది.

గత ఏడాది మూడో త్రైమాసికంలో 39.4 కోట్లుగా ఉన్న మొత్తం  ఖాతాదారుల సంఖ్య ఈ క్యూ3లో 40.4 కోట్లకు పెరిగిందని ఇండియా అండ్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాల్లో నికర వినియోగదారుల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. భారత కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ.14,768 కోట్లకు చేరిందని, తీవ్రమైన పోటీ వల్ల భారత మొబైల్‌ వ్యాపారం 4 శాతం క్షీణించిందని వివరించారు.