ముంబై: పీఎన్బీ స్కాంలో సహ నిందితుడు, నీరవ్ మోదీ మేనమామ మెహుల్ చోక్సీ యాజమాన్యంలోని గీతాంజలి జెమ్స్‌ను అమ్మేయాలని బ్యాంకుల కన్సార్టియం నిర్ణయించుకున్నది. తద్వారా సదరు సంస్థ తమ వద్ద తీసుకున్న రుణ బకాయిలను వసూలు చేసుకోవాలని ఆ కన్సార్టియంలోని బ్యాంకులు భావిస్తున్నాయి. 

31 బ్యాంకులకు రూ.12,550 కోట్లకుపైగా గీతాంజలి జెమ్స్ బకాయి పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని నకిలీ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ పేరిట రూ.14,000 కోట్ల కుంభకోణం ప్రధాన నిందితుల్లో మెహుల్ చోక్సీ కూడా ఒకరన్న విషయం తెలిసిందే.

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. చోక్సీకి మేనల్లుడవగా, ఈ మామాఅల్లుళ్లు కలిసి పీఎన్బీని మోసం చేసిన సంగతీ విదితమే. గతేడాది జనవరిలోనే వీరిరువురు కుటుంబ సభ్యులతోసహా విదేశాలకు పారిపోగా, ఆంటిగ్వా నుంచి చోక్సీ, బ్రిటన్ నుంచి నీరవ్ అప్పగింతల కోసం భారతీయ దర్యాప్తు సంస్థలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. 

కాగా, గీతాంజలి జెమ్స్‌కు అప్పులిచ్చిన బ్యాంకర్ల కమిటీ.. రిజల్యూషన్ ప్రక్రియ గల 180 రోజుల గడువు తీరిపోయిందని, రిజల్యూషన్ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇక సంస్థ ఆస్తులను అమ్మేసి, బకాయిల వసూలు చేసుకోవడమే మేలన్నఅభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు మంగళవారం స్టాక్ ఎక్సేంజ్‌లకు గీతాంజలి జెమ్స్ సమాచారం ఇచ్చింది.

గత నెల 28న సమావేశమైన రుణదాతల కమిటీ.. ఓటింగ్ నిర్వహించగా, 54.14 శాతం మెజారిటీతో గీతాంజలి జెమ్స్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చాయి. ఈ క్రమంలోనే నగదీకరణకు మొగ్గు చూపాయి. ఈ నెల ఆరో తేదీతో రిజల్యూషన్ ప్రక్రియకున్న గడువు తీరింది. దీన్ని పొడిగించాలని గీతాంజలి జెమ్స్ కోరుతుండగా, బ్యాంకర్లు అంగీకరించడం లేదు. 

గీతాంజలి జెమ్స్ రూ.12,558 కోట్ల బకాయిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వాటా అత్యధికంగా రూ.5,518.5 కోట్లుగా ఉండటం గమనార్హం. బ్యాంకర్ల కమిటీ ఓటింగ్‌లో పీఎన్బీకి 43.94 శాతం షేర్ ఉన్నది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ బకాయి రూ.890.20 కోట్లు ఉండగా, ఓటింగ్‌లో 7.09 శాతం షేర్ ఉంది. 

కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ.543.82 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ.521.81 కోట్లు చొప్పున ఈ ఆభరణాల సంస్థ బకాయిపడింది. ఇదిలా వుంటే ప్రపంచవ్యాప్తంగా నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు గల ఆస్తులను జప్తు చేయడానికి ఎన్‌సీఎల్‌టీ జోక్యాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.