ముంబై: బ్యాంక్‌ సిబ్బంది ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు చేయ తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. వేతన సవరణతోపాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అధికారులు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సిబ్బంది, అధికారులు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

వరుస సెలవుల మధ్యలో బ్యాంక్‌ అధికారులు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో దాదాపు ఆరో రోజులు  దేశంలో బ్యాంకింగ్‌ సమ్మె స్తంభించే అవకాశాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)అధికారులు, యునైటెడ్‌ ఫోరమ్‌ బ్యాంక్‌ యూనియన్‌ (యూఎఫ్‌బీయూ) ప్రతినిధులతో శనివారం సుదీర్ఘ చర్చలు జరిపారు. 

Also read:కరోనాకు కుబేరులూ ‘డింగ్’య్యారు: రూ.32 లక్షల కోట్లు లాస్

ఈ చర్చల్లో బ్యాంక్‌ సిబ్బందికి 15 శాతం వేతన పెంపునకు ఐబీఏ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా సమాచారం. దీనికి తోడు వివిధ ఇతర సమస్యలకు కూడా ఐబీఏ సానుకూలతను వ్యక్తం చేయడంతో యూఎఫ్‌బీయు తన సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించు కున్నట్టుగా యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. 

ముంబైలో తాము ఐబీఏ అధికారులతో మరోదఫా చర్చలు జరిపినట్టుగా ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. వెంకటాచలం తెలిపారు. ఐబీఏ తరపున ఈ చర్చల్లో నెగోషియేటింగ్‌ కమిటీ చైర్మెన్‌ రాజ్‌కిరణ్‌ రారు పాల్గొన్నట్టుగా ఏఐబీఈఏ తెలిపింది.

అయితే, వారానికి అయిదు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేసేలా నిబంధనలను సడలించాలని ఉద్యోగులు, అధికారులు ప్రధానంగా కోరుతూ వచ్చారు. అయితే దీనిపై త్వరలో జరుగనున్న చర్చలో మరోదఫా చర్చలు జరపనున్నట్లు అధికారులు తెలిపారు.

వేతన సవరణ విషయమై ఐబీఏ కొంత పట్టువిడిచి ప్రవర్తించడంతో రానున్న రోజుల్లో.. ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌పై ప్రధానంగా చర్చ జరపనున్నట్టుగా బ్యాంకు ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. ఈ చర్చల్లో భాగంగా కుటుంబ పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేసే విషయాన్ని కూడా ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు ఐబీఏ హామీ ఇచ్చినట్టుగా ఆయన తెలిపారు.