Asianet News TeluguAsianet News Telugu

ముకేశ్ మినహా కుబేరులకు గడ్డుకాలం.. ఇదీ ట్రేడ్‌వార్ ఎఫెక్ట్

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కుబేరుల సంపద హరించేస్తున్నది. కాకపోతే భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ సంపద మాత్రం 400 కోట్ల డాలర్లు పెరిగింది. అంతర్జాతీయంగా 128 మంది ఆసియా ఖండ కుబేరులు భారీగా నష్టపోయారని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అందులో లక్ష్మీ మిట్టల్ సంపద అత్యధికంగా 560 కోట్ల డాలర్లు హరీమంది.

Bad year for Asian billionaires
Author
New Delhi, First Published Dec 22, 2018, 10:39 AM IST

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ కుబేరుల సంపదను కుదేలు చేస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన అస్థిరతలు పలు వ్యాపారాలకు గతంలో ఎన్నడూ లేని కష్టాలు తెచ్చి పెట్టాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, తమ సంపద ఏ మేరకు క్షీణిస్తుందో తెలియని అగమ్యగోచర స్థితిలోకి ప్రపంచ సంపన్నులు చిక్కుకున్నారు. నెట్టివేశాయి. 500 మందితో బ్లూమ్‌బర్గ్‌ ప్రతీ ఏటా విడుదల చేసే కుబేరుల సూచిలో స్థానం పొందిన 128 మంది ఆసియా ప్రాంత కుబేరులు ఉమ్మడిగా 2018లో 13,700 కోట్ల డాలర్ల సంపదను కోల్పోయారు. కాకపోతే భారతీయుల్లో అత్యంత సంపన్నుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం ఇందుకు మినహాయింపే.
 
2012 తర్వాత ఆసియా ప్రాంత కుబేరుల సంపదలో క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారి. బ్లూమ్‌బర్గ్‌ కుబేరుల సూచిలోని 23 మంది భారతీయ కుబేరులు ఉమ్మడిగా 2,100 కోట్ల డాలర్ల సంపదను నష్టపోయారు. వారిలో ప్రపంచ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్‌ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన కోల్పోయిన సంపద విలువ రమారమీ 560 కోట్ల డాలర్లు ఉంటుంది. ఇక రెండో స్థానంలో ఉన్న సన్‌ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్‌ సంఘ్వి 460 కోట్ల డాలర్ల విలువైన సంపద కోల్పోయారు.
 
మరోవైపు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు ఈ ఏడాది ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను తీవ్రమైన ఆటుపోట్లకు గురి చేస్తున్నాయి. ఈ ఆటుపోట్లలో చైనా టెక్నాలజీ రంగం భారీగా నష్టపోయింది. భారత్‌, కొరియా కూడా ఇందుకు అతీతం కాదని హాంకాంగ్‌కు చెందిన యూబీఎస్‌ గ్రూప్‌ ఆర్థికవేత్త ఫిలిప్‌ వ్యాట్‌ అన్నారు. 2019లోనూ ఇదే తరహా క్షీణత ఉంటుందని, కుబేరులు మరింతగా సంపదను కోల్పోతారని తాను భావించడంలేదని ఆయన చెప్పారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు ప్రైవేటుట్ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రభుత్వ మద్దతు కూడా పొందడం వల్ల సంపద వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అన్నారు.
 
బ్లూమ్‌బర్గ్‌ జాబితాలో 40 మంది చైనా కుబేరులుండగా వారిలో మూడింట రెండు వంతుల మంది సంపద భారీగా నష్టపోయారు. వాండా గ్రూప్‌ అధినేత వాంగ్‌ జియాన్‌లిన్‌కు చెందిన ప్రాపర్టీ సంస్థ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఆస్తులు కూడా అమ్మే స్థితికి దిగజారింది. వాంగ్‌ ఏకంగా 1080 కోట్ల డాలర్ల సంపదను నష్టపోయారు. ఆసియా కుబేరుల్లో గరిష్ఠంగా నష్టపోయింది ఆయనే. 

జేడీ డాట్‌ కామ్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ లూ 480 కోట్ల డాలర్ల సంపదను నష్టపోయారు. దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కుబేరులు ఉమ్మడిగా 1720 కోట్ల డాలర్ల సంపదను నష్టపోయారు. శామ్‌సంగ్‌ ఎలక్ర్టానిక్స్‌ అధినేతలు, తండ్రీకొడుకులు లీకున్‌ హీ, జే వై లీ కొరియాకు చెందిన కుబేరులందరూ నష్టపోయిన సంపదలో మూడో వంతు నష్టపోయి తొలిస్థానంలో నిలిచారు.

హాంకాంగ్‌కు చెందిన స్థిరాస్తి రంగ దిగ్గజాలు భారీగా నష్టపోయారు. సీకే హచిసన్‌ అండ్‌ సీకే అసెట్స్‌ చైర్మన్‌గా ఇటీవలే పదవీ విరమణ చేసిన లీ కా షింగ్‌ 600 కోట్ల డాలర్ల సంపద నష్టపోయారు. హాంకాంగ్‌కు చెందిన రెండో కుబేరుడు లీ షు కీ కూడా 330 కోట్ల డాలర్లు నష్టపోయారు.

అంతర్జాతీయంగా ఇంత కల్లోలంలోనూ సంపదపరంగా లాభపడిన వారు కూడా ఉన్నారు. వారిలో భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ కూడా ఉన్నారు. ఆయన సం పద 400 కోట్ల డాలర్ల మేరకు పెరిగింది. తన యాజమాన్యంలోని రిలయన్స్‌ గ్రూప్‌ ఆటుపోట్లలోనూ పటిష్ఠంగా నిలిచి మెరుగైన లాభాలు జోడించడంతో ముకేశ్‌ ఆసియా కుబేరుడిగా ‘జాక్‌ మా’ స్థానాన్ని ఆక్రమించారు. 

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షామి జారీ చేసిన పబ్లిక్‌ ఇష్యూ విజయవంతం కావడంతో 870 కోట్ల డాలర్ల సంపద జోడించుకుని కంపెనీ అధినేత లీ జున్‌ బ్లూమ్‌బర్గ్‌ సూచిలో టాప్‌ 100లోకి దూసుకెళ్లారు. ప్రపంచ దుస్తుల రిటైలింగ్‌ కంపెనీ ఫాస్ట్‌ రిటైలింగ్‌ షేర్లు 30 శాతం పెరగడంతో జపాన్‌ కుబేరుడు తదాషి యానై సంపదకు 630 కోట్ల డాలర్లు జోడైంది. టెక్నాలజీ, వినియోగ, బయోటెక్‌, ఫార్మారంగాలు ఈ సూచీకి కొత్త కుబేరులను జోడించాయి. 2018లో ఆరుగురు ఆసియా ఖండ ఆరుగురు కుబేరులు మరణించారు. వారు వారసులకు అందించిన ఆస్తి విలువ 2,900 కోట్ల డాలర్లు ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios