న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడీ’ ఈ ఏడాది చివరిలోగా భారతదేశ విపణిలో ‘ఈ-ట్రోన్’ ఎస్‌యూవీ కారును ఆవిష్కరిస్తామని తెలిపింది. విదేశీ దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచినా ఈ ఏడాది చివరిలోగా ‘ఈ-ట్రోన్’ ఆవిష్కరిస్తామని ప్రకటించింది. భారతదేశంలోకి విద్యుత్ వాహనాలను తేవడానికి దీర్ఘ కాలిక వ్యూహం కావాలని ఆడి తెలిపింది. బ్యాటరీ తదితర అంశాలపై నియంత్రణ చర్యలు తగ్గించాల్సి ఉంటుందని అంచనా వేస్తోంది. 

also read హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏమున్నా మా ప్లాన్ల విషయంలో ఎటువంటి ప్రభావం చూపదు. మేం మా వాహనాలను విద్యుద్ధీకరణ దిశగా అడుగేసే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఏడాది చివరిలోగా ఈ-ట్రోన్ కారును విపణిలోకి తీసుకొస్తాం’ అని తెలిపారు. 

సంప్రదాయ వాహనాల విడి భాగాలను దిగుమతి చేసుకున్నట్లయితే దానిపై కస్టమ్స్ సుంకం 25 శాతం నుంచి 40 శాతానికి పెరుగుతుంది. విద్యుత్ వాహనాల వినియోగంపై కస్టమ్స్ సుంకం 15 నుంచి 30 శాతానికి పెంచుతారు. పూర్తిగా విద్యుత్ వాహనాలను దిగుమతి చేసుకుంటే దానిపై అమలులో ఉన్న కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 15 శాతం. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగిన కస్టమ్స్ సుంకం అమలులోకి వస్తుంది. 

also read ఇండియాలోకి లెక్సెస్‌ సూపర్‌ కార్లు... ప్రారంభపు ధర..

పూర్తిగా వాహనాన్ని దిగుమతి చేసుకుంటే దాని ధర భరించడం కష్టమేనని ఆడి ఇండియా అధినేత ధిల్లాన్ తెలిపారు. ప్రస్తుతానికి భారతదేశంలో కార్ల ఉత్పత్తి చేసే అవకాశం లేదని కొట్టి పారేశారు. పరిస్థితులు అనుకూలించే వరకు కార్లను దిగుమతి చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. దిగుమతి సుంకాల తగ్గింపునకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ధిల్లాన్ వివరించారు.